అక్రమార్కులకు ఆఫ్‌‘లైన్‌ క్లియర్‌’

23 Oct, 2018 11:50 IST|Sakshi

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల నియామక నోటిఫికేషన్‌పై దుమారం

ప్రతి చిన్న నియామకమూ ఆన్‌లైన్‌లో చేపడుతుండగా..

1,171 వైద్యుల భర్తీ ఆఫ్‌లైన్‌లోనట

అక్రమంగా తమ వారిని ఎంపిక చేసుకునేందుకేనంటున్న అభ్యర్థులు

అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన

సాక్షి, అమరావతి: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను గత రెండు దఫాలుగా ఆన్‌లైన్‌ విధానంలో భర్తీ చేసిన సర్కారు.. తాజా నోటిఫికేషన్‌లో ఆఫ్‌లైన్‌ ద్వారా భర్తీ చేస్తామనడంతో అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం అక్రమార్కులకు వరం కానుందని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తెచ్చి తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని.. దీనివల్ల ప్రతిభ కలిగిన వైద్యులకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అసలే ఉద్యోగ నియామకాల్లేక నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వైద్యులకు.. ఈ నోటిఫికేషన్‌ను చూసి సంతోషించాలో.. బాధపడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

ఆఫ్‌లైన్‌ ఎవరి కోసమో!
ప్రజారోగ్యశాఖలో, బోధనాస్పత్రుల్లో కలిపి 1171 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు 2018 సెప్టెంబర్‌ 26న నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్‌ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో అక్రమార్కులకు రాచబాట వేసినట్టుగా అర్థమవుతోందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. గతంలో అంటే 2010లో ఒకసారి, 2013లో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరిపారు. అప్పట్లోనే ఆన్‌లైన్‌ పద్ధతిలో నియామకాలు చేపట్టారు. కానీ తాజా నోటిఫికేషన్‌లో ఆన్‌లైన్‌ అనే పద్ధతిని వాడలేదు. ఎవరికోసం ఆఫ్‌లైన్‌ పెట్టారో అర్థంకాని పరిస్థితి. ఒక్కో పోస్టుకు 12 మంది (1:12)లెక్కన 1171 పోస్టులకు.. 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్న ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

మాన్యువల్‌గా నియామకాలు చేపడితే.. ఏ దశలోనైనా సర్టిఫికెట్లు గానీ, డాక్యుమెంట్లు గానీ మార్చేయడానికి అవకాశముందని, నియామక కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు బాటలు వేసినట్లవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. అభ్యర్థులు కుటుంబ సంక్షేమశాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తును డౌన్‌లోడు చేసుకుని, దాన్ని పూరించి సర్టిఫికెట్లన్నీ జతచేసి ఈ నెల 25వ తేదీలోగా గొల్లపూడిలోని కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయానికి చేర్చాలని పేర్కొన్నారు. తాము పంపిన దరఖాస్తుల్లో ఏదైనా సర్టిఫికెట్‌ లేకున్నా, కావాలని వాటిని తీసేసినా దానికి ఎవరు బాధ్యత వహిస్తారనేది అభ్యర్థుల ఆందోళన. ఆన్‌లైన్‌లో అయితే ఎవరి మార్కులు ఎన్ని, సర్వీసు ఎంత.. ఇలాంటివన్నీ తెలిసే అవకాశముందని, ఆఫ్‌లైన్‌ అయితే అన్నీ గుట్టుగా సాగే అవకాశముందనేది పలువురు వైద్యులంటున్నారు.

జోనల్‌ వ్యవస్థపై స్పష్టత లేకుండానే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జోనల్‌ వ్యవస్థ అనేది దశాబ్దాల తరబడి ఉంది. రాష్ట్రప్రతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్స్‌) మేరకు కొనసాగుతున్న ప్రక్రియ ఇది. దీనిపై స్పష్టత ఇవ్వకుండానే నోటిఫికేషన్‌ జారీచేశారు. రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 6 జోన్లుగానూ, హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌గానూ ఉండేది. ఈ జోనల్‌ వ్యవస్థపై చివరి సారిగా 2002లో జీవో ఎంఎస్‌ నం.124 ద్వారా సవరణలు చేసి అప్పట్లో నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత ఇప్పటివరకూ ఎలాంటి సవరణలూ లేవు. 2014లో రాష్ట్రం విడిపోయాక దీనిపై స్పష్టత రాలేదు. ఫలితంగా ఏ జోన్‌లో ఎన్ని పోస్టులన్న వివరాల్లేవు. దీంతో కొన్ని జోన్లలో పోస్టుల్లేక, మరికొన్ని జోన్లలో పోస్టులు ఎక్కువగా ఉండి అసమానతలు ఏర్పడే అవకాశముందని అధికార వర్గాలంటున్నాయి. ఇలాంటి విషయాల్లో స్పష్టత లేకుండా హడావుడిగా నోటిఫికేషన్‌ జారీ చేశారని అధికారవర్గాల్లో చర్చజరుగుతోంది.

మరిన్ని వార్తలు