పిక్నిక్‌లో వివాదం... దారికాచి దాడి

13 Nov, 2017 10:29 IST|Sakshi
దాడిలో గాయపడ్డ చిన్నారులు

తొమ్మిది మందికి గాయాలు

క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు  

బొబ్బిలి:  పిక్నిక్‌లో చోటు చేసుకున్న చిన్న వివాదం చినికిచినికి గాలివానై చివరకు కొట్లాటకు దారి తీసింది.  ఆదివారం సాయంత్రం  రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఓ వర్గానికి చెందిన తొమ్మిది మంది గాయాల పాలయ్యారు. వెంటనే వీరిని స్థానిక సీహెచ్‌సీకి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం కేంద్రాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  బాధితులు చెప్పిన వివరాల ప్రకారం... పట్టణంలోని గొల్లవీధి, చిక్కాల రెల్లివీధులకు చెందిన వారు వేర్వేరుగా పిక్నిక్‌కు వెళ్లారు. బొబ్బిలి మండలం పెంట గ్రామం వద్ద వున్న వేగావతి నదిలో అందరూ సరదాగా స్నానానికి దిగారు. పిక్నిక్‌కు వచ్చిన వారిలో వర్గాల వారీ కాకుండా ఎవరికి తోచిన విధంగా వారు సరదాగా గడుపుతూ నదిలో కేరింతలు కొడుతున్నారు.

ఈ సమయంలో చిక్కాల వీధికి చెందిన జె.శ్రీను అనే వ్యక్తి తన కుమార్తెకు స్నానం చేయిçస్తూ అదుపుతప్పి టీచర్స్‌ కాలనీ(గొల్లవీధి)కి చెందిన శ్రీను అనే వ్యక్తి మీద పడిపోయాడు. దీంతో క్షమాపణ కోరాడు. దీంతో గొడవ రేగి కులదూషణ చేస్తూ జె.శ్రీను అనే వ్యక్తిపై దాడికి దిగినట్టు చెప్పారు. అప్పటికి ఇరువర్గాలనూ అక్కడున్న వారు సముదాయించారు. అప్పటికి ఘర్షణ చల్లబడింది. అయితే సాయంత్రం ఇంటికి వస్తుండగా అప్పయ్యపేట రహదారి మధ్యలో గొల్లవీధికి చెందిన కొంత మందిని తీసుకువచ్చి జె.శ్రీను తదితరులపై దాడికి దిగారు. ఈ సమయంలో ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో పలువురు గాయపడ్డారు. చిన్నవారిని కూడా గాయపర్చారని చిక్కాల రెల్లివీధికి చెందిన వారు వాపోయారు. ఈ దాడిలో సోము యామిని, సోము రేణుక, శ్రీను, విష్ణు, ప్రశాంత్, రాజేష్, బంగారి శివ, దానాల కనకరాజు, గురుమూర్తి తదితరులు గాయపడ్డారు. వీరిలో రాజేష్‌ పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు