కొండ చుట్టూ వివాదాలు

26 Apr, 2019 09:28 IST|Sakshi

పింక్‌ డైమండ్, పోటులో తవ్వకాలపై తొలగని అనుమానాలు

ఆభరణాలు మాయమయ్యాయంటున్న ఆరోపణల్లో నిజమెంత ?

ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ సొమ్ములు డిపాజిట్‌ చేస్తున్న వైనం

స్వామి దర్శనాలు, సేవలు, ప్రసాదాలను బ్లాక్‌లో అమ్ముకుంటున్న పెద్దలు

టీటీడీ సొమ్ము టీడీపీ పెద్దల ప్రయోజనాల కోసం తాకట్టు

తిరుమలలో నిత్యావసర సరుకుల కొనుగోళ్ల గోల్‌మాల్‌

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. పింక్‌ డైమండ్‌ మాయమైందన్న దానిపై స్పష్టత లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. లెక్కలేనన్ని వివాదాలు టీటీడీని చుట్టుముట్టుతున్నా.. ఉన్నతాధికారుల నుంచి ఆధారాలతో కూడిన వివరణ చెప్పిన దాఖలాలు కనిపించడం లేదు.  శ్రీవారికి సమర్పించిన అనేక బంగారు ఆభరణాలు కనిపించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తిరుమల పోటులో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారన్న దానిపై టీటీడీ పొంతనలేని సమాధానాలు.. ప్రభుత్వ పెద్దల సేవ కోసం తహతహలాడే టీటీడీ అధికారులు కొందరు స్వామివారిని సైతం పస్తులు ఉంచారని అర్చకుల ఆందోళన.. టీటీడీ నిధులు టీడీపీ నేతల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. తిరుమల ఆలయంలో జరుగుతున్న అపచారాలపై నోరు విప్పినందుకు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, మరి కొందరిని రిటైర్‌మెంట్‌ పేరుతో ఇంటికి పంపారని ఆరోపణలు ఉన్నాయి. శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి గురైన కిరీటాల వెనుక నిర్లక్ష్యంపై ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా తమిళనాడులో పట్టుబడ్డ రూ.కోట్లు విలువచేసే బంగారంపై టీటీడీ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంపై మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లు అవుతోంది. ఇలా టీటీడీపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చి భక్తుల్లో నమ్మకాన్ని పెంచాల్సిన ప్రభుత్వ అధికారులు, టీటీడీ ఆ ప్రయత్నాలేవీ చేయకపోవడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

పింక్‌ డైమండ్‌.. పోటు తవ్వకాలపై వీడని మిస్టరీ
కోట్ల రూపాయలు విలువచేసే డైమండ్‌ను విదేశాల్లో విక్రయించారని తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. పింక్‌ డైమండ్‌తో పాటు శ్రీవారికి సమర్పించిన విలువైన ఆభరణాలు కూడా మాయమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, అందులో శ్రీవారి పోటులో రహస్యంగా తవ్వకాలు జరిపారన్న ది రమణదీక్షితులతో పాటు, టీటీడీ ఆలయ చరిత్రపై ముద్రించిన పుస్తకాల్లోనూ పేర్కొన్నారు. ఆలయంలోని ప్రదక్షిణ ప్రాకారంలో శ్రీవారికి సమర్పించిన విలువైన కానుకలను పూడ్చిపెట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. బ్రిటిష్‌ కాలంలో తహశీల్దార్‌గా పనిచేసిన శ్రీనివాసాచార్యులు పోటులో తవ్వకాలు జరిపి అర్థాంతరంగా ఆపివేసిన విషయాన్ని అప్పటి కలెక్టర్‌ జేమ్స్‌ స్టార్టన్‌ రచించిన ‘సవాల్‌ ఈ జవాబ్‌’ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని టీటీడీలో పనిచేస్తూ ఉద్యోగ విమరణ పొందిన సొరకాయల కృష్ణారెడ్డి ‘గోపీకృష్ణ’ పేరుతో ‘మన ఆలయాల చరిత్ర’గా తెలుగులో అనువదించారు. అందులో  ‘శ్రీవారికి అనేక మంది కానుకలు సమర్పించారు. వాటిని ఎక్కడ దాయాలో తెలియక అప్పట్లో ఆలయ నిర్వాహకులు ప్రదక్షిణ ప్రాకారంలో పూడ్చిపెట్టారు. ఆ ప్రదక్షిణ ప్రాకారం 300 గజాల పొడవు.. 40 గజాల వెడల్పు కలిగి ఉంటుంది. ఆ విస్తీర్ణంలో రాజులు శ్రీవారికి సమర్పించిన కానుకలను బండల కింద ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకునేందుకు అప్పట్లో తహశీల్దార్‌గా పనిచేసిన శ్రీనివాసాచార్యులు ప్రయత్నించారు. అయితే తనకు, తనతో పనిచేసే వారికి అకస్మాత్తుగా జబ్బుచేయడంతో అది అపచారంగా భావించి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటి నుంచి అనేక మంది తవ్వకాలు జరిపి విఫలమయ్యారు. ఆ తరువాత ప్రదక్షిణ ప్రాకారాన్ని మూతవేశారు. అందులో శ్రీరామానుజస్వామి, తొండమాన్‌ చక్రవర్తి సమర్పించిన విలువైన కానుకలు కూడా బండల కింద దాచి ఉంచినట్లు ప్రచారం ఉంది. వాటిలో అతి ముఖ్యమైంది నాగా భరణం. ఈ ఆభరణం బిల్వ పత్రాలను పోలి ఉంటుంది.’ అని పేర్కొన్నారు.

ఆ బంగారం పట్టుబడకుండా ఉంటే?
తమిళనాడులో ఎన్నికల ముందు రోజు గత బుధవారం రాత్రి రూ.400 కోట్లకుపైగా విలువచేసే 1381 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ బంగారం మొదటి తమకు సంబంధం లేదని చెప్పిన టీటీడీ, కొన్ని గంటల తరువాత ఆ బంగారం టీటీడీదేనని ప్రకటించింది. అన్ని కోట్లు విలువచేసే బం గారం తరలించే సమయంలో ఎటువంటి భద్రత లేకుండా తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమి టని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో పట్టుబడ్డ బంగారాన్ని ఎక్కడికో తరలిస్తుండగా పట్టుబడిందా? అధికారులు పట్టుకోవడంతో టీటీడీ ట్రెజరీకి చేరిందంటున్నారు. బంగారం తరలింపు విషయంలో ఇటు టీటీడీ, అటు బ్యాంకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదని విచారణాధికారి మన్మోహన్‌సింగ్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యంకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయకుండా కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి నగదు, బం గారాన్ని  ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అందుకే తవ్వకాలు జరిపారా ?
క్రీస్తు పూర్వం 1150లో నిర్మించిన ఆలయంలోని పోటులోనే రోజూ మూడు వేళలా మూడు రకాల ప్రసాదాలు త యారు చేసి స్వామి వారికి సమర్పిస్తారు. అటువంటి ప్రాకారాలను పగులగొట్టడానికి 2017 డిసెంబర్‌ 8 నుంచి 30 వరకు మూతవేశారనేది రమణదీక్షితులు చేసిన ఆరోపణ. ఆలయంలో విమాన ప్రాకారం, బూందిపోటు, లోపల పోటులో ఏ పనిచేయాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే చేపట్టాల్సి ఉందని అర్చకులు అభిప్రాయం. పోటులో చేపట్టిన పనులకు సంబంధించి ఎవ్వరికీ తెలియదని, అంత రహస్యంగా ఎందుకు పనులు చేయాల్సిన అవసరం ఏముందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆలయంలో మరమ్మతులు చేయాలంటే ఆగమ అడ్వైజర్‌ను సంప్రదించాల్సి ఉన్నా.. అటువంటి ప్రయత్నాలేవీ చేయలేదని దీక్షితుల ప్రశ్న. డిసెంబర్‌ 20న పోటును పరిశీలించే వరకు ఆ అపచారం గురించి తనకు తెలియదని పేర్కొన్నారు కూడా. పోటులో జరిగిన తవ్వకాలు చూసి ఆశ్చర్యపోయానని, పురాతనమైన గోడలను, బండలను పగులగొట్టడం చూసి బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీ  ష్‌ హయాంలో జిల్లా కలెక్టర్‌ పుస్తకంలో రాసిన అంశాలు, రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు పోలికలు ఉన్నాయని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ 22 రోజులు పోటులో ఏం జరిగిందనే దానిపై అటు భక్తులు, ఇటు టీటీడీ అధికారులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని చెబుతున్న టీటీడీ, ఆ సమయంలో ఉన్న సీసీ పుటేజీని బయటపెడితే నిజా నిజాలు బయటపడే అవకాశం ఉన్నా.. ఆ ప్రయత్నం చేయక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే టీటీడీ అధికారులు కొందరు వీవీఐపీల సేవలో తరిస్తూ భక్తులను విస్మరిస్తున్నారనే ఆరో పణలు ఉన్నాయి. ఇంకా స్వామి వారికి రోజూ జరిగే సుప్రభాతసేవను అర్ధరాత్రి నుంచే నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారని, 20 నిమిషాలపాటు జరగాల్సిన తోమాల సేవను పది నిమిషాల్లో ముగించాలని అధికారులు ఒత్తిడి చేస్తు న్నారని ప్రధాన అర్చకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిపాజిట్లుప్రైవేటు బ్యాంకులోఎందుకు?
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు.. వచ్చే ఆదా యం సుమారు రూ.వెయ్యి కోట్లు టీటీడీ ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్‌ చేసిం ది. ప్రభుత్వ బ్యాంకులు ఉన్నా... ప్రైవేటు బ్యాంకులో ఎందుకు డిపాజిట్‌ చేయాల్సి వచ్చిందని రాయలసీమ హక్కుల పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి వెలుగులోకి తీసుకురావడంతో పాటు కోర్టును ఆశ్రయించారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాల్సిన టీటీడీ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. అదే విధంగా లడ్డూ పోటును విస్తరించే క్రమంలో ఉగ్రాణం వద్ద ఉన్న గోడను తొలగించి పెద్దది చేయాలని టీటీడీ భావించినట్లు సమాచారం. ఆ గోడను తొలగించేందుకు టీటీడీ రూ.2 కోట్లతో టెండర్‌ పిలిచి నిధులు దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక గోడను తొలగించేందుకు రూ.2 కోట్లు అవసరమా? అని టీటీడీ అధికారులే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అదే విధంగా శ్రీవారి ఆలయంలో వెండివాకిలి వద్ద భక్తులకు వీలుగా ఉండేందుకు మెట్లను ఏర్పాటు చేశారు. అది ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఏర్పాటు చేశారని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే తొలగించారు. ఆ మెట్లు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.33 లక్షలు ఖర్చుచేసినట్లు తెలిసింది. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కొందరు అధికారులు స్వలాభం కోసం ఖర్చుచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

టీటీడీ నిర్లక్ష్యంతోనే కిరీటాలు చోరీ

శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు అలంకరించిన కిరీటాల చోరీకి టీటీడీ నిర్లక్ష్యమే కారణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా చోరీ చేధించే విషయంలో ఎక్కడా టీటీడీ పాత్ర నామమాత్రంగా కూడా కనిపించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలకరించిన మూడు బంగారు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. చోరీకి గురైన కిరీటాలను దొంగ కరిగించి అమ్మిసొమ్ము చేసుకున్నాడు. చోరీకి గురై 80 రోజులు గడచిపోయినా.. కిరీటాలు అపహరణకు గురైన విషయంలో బాధ్యులపై టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు పట్టుకుని అప్పగించడంతో దొంగ దొరి కాడని, బంగారం దొరికిందని సముదాయించుకుంటున్నారు తప్పితే టీటీడీ చేసిందేమీ లేదని తెలుస్తోంది. మొత్తంగా ఐదేళ్ల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో టీడీపీ నేతల పెత్తనం అధికం కావడంతో అధికారులు కూడా ఇష్టారాజ్యం వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక దర్శనాల టికెట్లు, లడ్డూలు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మి సొమ్ముచేసుకోవడంలోనూ విమర్శలు ఉన్నాయి. పాలకమండలి సభ్యులు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలతో పాటు వివిధ సేవా టికెట్లను బ్లాక్‌లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారే ప్రచారం ఉంది. ఇలా టీటీడీ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నా... వాటిపై ఎక్కడా విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చిన దాఖలాలు లేవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మంత్రి అనుచరులకు రెస్టారెంట్లు
తిరుమలలో మంత్రి అనుచరులకు రెస్టారెంట్లు కట్టబెట్టారు. తిరుమలలో ఉన్న రెస్టారెంట్లు, క్యాంటీన్లలో టీటీడీ నిర్ణయించిన ధరలు అమలు కావడం లేదని వాటిని మూసివేశారు. ఆ తరువాత వాట న్నింటికీ ఇటీవల టెండర్లు పిలిచారు. అయితే అన్నమయ్య భవన్‌తో పాటు అన్నమయ్య రెస్టారెంట్, మ్యూజియం సమీపంలోని సందీప రెస్టారెంట్‌కు మాత్రం టెండరు విధానం కాకుండా కొత్త పద్ధతిలో అప్పగించేందుకు పథకం వేశారు. అందులో భాగంగా ఈ రెస్టారెంట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కూడా నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో సందీప రెస్టారెంట్‌ దరఖాస్తు చేసుకుంది. ఆ రెస్టారెంట్లకు నెలకు రూ.3 లక్షల అద్దె చెల్లించేందుకు సిద్ధమైంది. ఇదే రెస్టారెంట్‌ గతంలో రూ.45.66 లక్షలు పలికింది. దీనికి ముందు ఉన్న మయూర హోటల్‌ వారు ఇదే రెస్టారెంట్‌కు నెలకు రూ.8.83 లక్షలు అద్దె చెల్లిస్తూ వచ్చారు. అయితే దీన్ని కేవలం రూ.3 లక్షలకే ఏపీటీడీసీకి కట్టబెట్టేందుకు టీడీపీ పాలకమండలి తీర్మానించింది. ఈ లెక్కన గత టెండరుతో పోల్చితే నెలకు రూ.42 లక్షలు, ఏడాదికి రూ.5 కోట్లు టీటీడీ నష్టపోవాల్సి వస్తోంది. ఇంత తగ్గించి అప్పజెప్పినా ఆ రెస్టారెంట్లలో భక్తులకు తక్కువ ధరకు భోజనం పెడుతున్నారా? అంటే అదీ లేదు. జనతా హోటల్‌లో రూ.60 భోజనం ఉంటే.. ఏపీటీడీసీలో రూ.120 ఉంది. వడ రూ. 24 ఉంటే.. ఏపీటీడీసీలో రూ.60 ఉంది. ఇలా అన్ని తినుబండారాల ధరలు రెట్టింపుగా ఉన్నాయి. రెస్టారెంట్‌ను దక్కించుకున్నా ఏపీ టూరిజం శాఖ వారు నడుపుతున్నారా? అంటే అదీ లేదు. వాటిని మంత్రి అనుచరులకు నామమాత్రపు ధరతో అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

టీడీపీ నేతల స్వప్రయోజనాలకు నిధులు
టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కోసం భూమి కేటాయించలేదు. అయితే టాటా ఆస్పత్రికి మాత్రం సుమారు రూ.వెయ్యి కోట్లు విలువచేసే భూమిని కేటాయించడంపై అప్పట్లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా టీడీపీ నేతల స్వప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనుల కోసం రూ.40 కోట్లు టీటీడీ నిధులు కేటాయించింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఆల య నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్న టీటీడీకి ప్రభుత్వం అమరావతిలో భూమిని ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ప్రైవేటు సంస్థలకు వందల ఎకరాలను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం టీటీడీకి మాత్రం ఉచితంగా ఇచ్చేందుకు  ఇష్టపడలేదు. ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు భూమిని కూడా టీటీడీనే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేసింది. దీంతో టీటీడీ అమరావతిలో రూ.12.50 కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసింది.

నిత్యావసరాల కొనుగోల్‌మాల్‌
తిరుమలలో శ్రీవారి భక్తులకు నిత్యాన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీ కోసం టీటీడీ కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల కోసం వినియోగించే నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పప్పుదినుసులు పూర్తిగా నాసిరకంగా ఉంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా స్వామి వారికి అభిషేకం తరువాత వినియోగించే పట్టువస్త్రాలు, వీఐపీలకు కప్పే వస్త్రాలు తదితరాలు కూడా నాసిరకమైనవిగా ప్రచారం జరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ, వడ, జిలేబి, వివిధ రకాల పప్పుదినుసులు, కొబ్బరికాయలు, స్వామివారి పట్టువస్త్రాలు, వీఐపీలకు కప్పే పట్టువస్త్రాలతో పాటు సుమారు 250 రకాల వస్తువులను టీటీడీ  కొనుగోచేస్తోంది. వాటిని తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ గోదాములో నిల్వచేస్తుంటారు. ఈ వస్తువుల కోసం ఏటా టీటీడీ కోట్ల రూపాయలు బడ్జెట్‌ కేటాయిస్తుంటుంది. అందులో భాగంగా గత ఏడాది రూ.450 కోట్లు కేటాయించింది. అధికమాసం కారణంగా ఈ ఏడు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడం, పెరటాసి నెల రావడంతో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని సరుకుల కొనుగోళ్లకు టెండర్‌ పిలిచి కాంట్రాక్టరుకు అప్పగించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆ ఆరోపణలపై విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చిని దాఖలాలు లేవు.

అన్న ప్రసాదం ‘చిన్న’ బోయింది
తిరుమలలో అన్నప్రసాదాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. తిరుమల శ్రీవారికి లడ్డూతో పాటు మరెన్నో రకాల అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. శ్రీవారి లడ్డూలు ఎంత రుచిగా ఉంటాయో.. స్వామికి సమర్పించే అన్న ప్రసాదాలు మరింత రుచిగా ఉంటాయి. అటువంటి అన్న ప్రసాదాలు ఇటీవల కాలంలో దొరకడమే అరుదైపోతోంది. చక్కెర పొంగలి, దద్దోజనం, సీరా, కదంబం, పులిహోరా, మలిహోరా, పాయసం, పోలీ, సుగీ, జిలేబి ఇవన్నీ రుచిగా ఉంటాయి. నెయ్యి కారుతూ.. జీడిపప్పు తేలుతూ ఉండే శ్రీవారి అన్నప్రసాదం కొద్దిగానైనా ఆరగించాలని భక్తులు ఆశపడుతారు. అటువంటి అన్న ప్రసాదాలు ప్రస్తుతం కరువయ్యాయి. సాధారణ రోజుల్లో రోజుకు 900 కిలోలు (200 గంగాళాలు), వారంతాల్లో రోజుకు 1200 కిలోలు (250 గంగాళాలు) ప్రసాదాలు తయారు చేసేవారు. ఈ ప్రసాదాలను వకుళామాత పోటు, పాకశాల, అవ్వపోటు అని పిలిచే వంటశాలలోనే దాదాపు వెయ్యి ఏళ్లుగా తయారువుతున్నాయి. ఇక్కడ సిద్ధమైన ప్రసాదాలను శ్రీవారి గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామికి ఆరగింపు చేస్తారు. ఆపై భక్తులకు పంచిపెడుతుంటారు. స్వామి వారికి సమర్పించే ప్రసాదాలను వైఖానస వైష్ణవులు అత్యంత నిష్టతో తయారు చేస్తారు. తిరుమలలో నిత్యం  గంగాళాలకు గంగాళాలు ప్రసాదాలు తయారై వస్తుండేవి.  చిన్న లడ్డూ రోజులో ఒకటి రెండు గంటలు సమయం మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. మిగతా సమయం అంతా అన్న ప్రసాదాలనే పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

దేవస్థానంలో జరుగుతున్న అపచారాలు, పొరబాట్లను ఎత్తిచూపినందుకు ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, మరి కొందరు అర్చకులను పాలకమండలి రిటైర్‌మెంట్‌ ఇచ్చి ఇంటికి పంపింది. అర్చకులను ఇంటికి పంపడం వెనుక కేవలం కక్ష సాధింపేనని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు కొన్నాళ్లకు ముందు ఏర్పాటైన పాలకమండలి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా