శ్రీవారి ఆలయంలో అపచారం

27 Mar, 2018 02:04 IST|Sakshi
తెప్పోత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు (ఫైల్‌ ఫొటో)

     కిందపడిన భూదేవి అమ్మవారి విగ్రహం 

     అర్చకుల నిర్లక్ష్యంతో ఘటన  

     గోప్యంగా ఉంచిన అధికారులు  

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. స్వామివారి సన్నిధిలోని రాములవారి మేడ వద్ద భూదేవి అమ్మవారి విగ్రహం కిందపడింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భాలయ మూలమూర్తితోపాటు నాలుగు అతిముఖ్యమైన విగ్రహాలున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఆలయం వెలుపల వైభవోత్సవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. సహస్ర దీపాలంకార సేవ రద్దు చేయటంతో అర్చకులు 3.30 గంటలకు ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్దకు తీసుకొచ్చారు.

అక్కడి నుంచి ఆలయంలోకి తీసుకెళ్తుండగా భూదేవి అమ్మవారి విగ్రహం రాములవారి మేడ వద్ద ప్రమాదవశాత్తు కిందపడింది. అర్చకుల అజాగ్రత్త కారణంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా విగ్రహ కిరీటం, పీఠం భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఆలయంలో అర్చకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఈ ఘటనకు పరోక్ష కారణమని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు