ఏయూ పాలకమండలి రద్దు

29 Jun, 2019 14:24 IST|Sakshi

ఉన్నత విద్య బలోపేతంపై సర్కారు దృష్టి

అందులో భాగంగానే 10 వర్సిటీల పాలకమండళ్లు రద్దు

మూడేళ్లకుపైగా నామమాత్రంగానే ప్రస్తుత పాలకమండలి

మండలి, అధికారుల మధ్య సమన్వయలోపం అభివృద్ధికి విఘాతం

ఉన్నత విద్య ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం కట్టింది. సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ప్రస్తుత పాలకవర్గాలపై వేటు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన జీవో ప్రకారం ఆంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గం కూడా రద్దయ్యింది. 2016 ఫిబ్రవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత పాలకవర్గాన్ని నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరితోనే పాలకవర్గ పదవీకాలం పూర్తి కాగా.. మరో అరు నెలలు పొడిగిస్తూ అదే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మూడేళ్లకుపైగా అధికారంలో ఉన్న పాలకమండలి వర్సిటీ అభివృద్ధికి చేసిన కృషి మచ్చుకైనా కనిపించలేదు. అధికారులు సూచించిన వాటికి తలూపడం తప్ప విలువైన సూచనలు గానీ, తమస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయించడానికి గానీ ప్రయత్నించకుండా నామమాత్రంగా మిగిలిపోయారు. ఈ పరిస్థితిని మార్చడానికే వైఎస్‌ జగన్‌ సర్కారు వర్సిటీలపై వేటు వేయడంతో మంచి పాలకమండలి వస్తుందన్న ఆనందం వర్సిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 

సాక్షి, విశాఖపట్నం: విశ్వ విద్యాలయాల బలోపేతం.. ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సమర్థ వంతమైన సారథులను నియమించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని మెత్తం 10 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవోఆర్‌టీ 82ను విడుదల చేసింది. దీంతో ఆంధ్రవిశ్వవిద్యాలయం పాలక మండలి రద్దయింది. తాజాగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఆచార్య హేమచంద్రారెడ్డి నియామకం.., నేడు పాలక మండళ్లు రద్దు చేయడం ప్రభుత్వం దూకుడును స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహాలో త్వరలో వర్సిటీల్లో పూర్తిస్థాయిలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి
గత ప్రభుత్వ హయాంలో పాలక మండలి సభ్యులుగా ఆచార్య ఎం.ప్రసాదరావు, ఆచార్య జి.శశిభూషణరావు, డాక్టర్‌ సురేష్‌ చిట్టినేని, డాక్టర్‌ ఎస్‌.విజయ రవీంద్ర, గ్రంధి మల్లికార్జున రావు, డాక్టర్‌ కె.మురళీదివి, డాక్టర్‌ పి.సోమనాథరావు, ఆచార్య ఎన్‌. బాబయ్యలను నియమిస్తూ 2016 ఫిబ్రవరి 3న అప్పటి ప్రభుత్వం  జీవోఎంఎస్‌ 5ను జారీ చేసింది. మూడేళ్ల కాలానికి వీరిని నియమించింది. ఆ ప్రకారం వీరి పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసింది. అయితే పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 24న జీవో 32ను జారీ చేసింది.  ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నేపథ్యంలో నేటితో పాలక మండలి పూర్తిస్తాయిలో రద్దయ్యినట్లయింది. అలాగే  వచ్చే నెల 16వ తేదీతో ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న, త్వరలో ఖాళీ అయ్యే విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి సైతం త్వరలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


పాలకమండలి సమావేశంలో చర్చిస్తున్న సభ్యులు  (పాత చిత్రం) 

నామమాత్రంగా పాలక మండళ్లు
గత ప్రభుత్వ హయాంలో నియమితులైన పాలక మండలి సభ్యులు నామమాత్రంగానే మిగిలిపోయారు. పాలక మండలి సమావేశంలో విశ్వవిద్యాలయాల అభివృద్ధికి వీరు అందించిన సూచనలు మచ్చుకైనా కనిపించలేదు. వర్సిటీ అధికారులు ప్రవేశపెట్టే వివిధ అంశాలను పరిశీలించడం, అనుమతించడం, తిరస్కరించడానికే పరిమితమైంది.వర్సిటీ అధికారులకు, పాలక మండలి సభ్యులకు మధ్య సమన్వయం కుదరడానికి చాలా సమయం పట్టింది. దీంతో వర్సిటీ పాలకులకు, పాలక మండలి సభ్యులకు మధ్య అగాథం పెరిగింది. పాలక మండలి సభ్యులు వర్సిటీ వికాసానికి ఉపకరించే  పథకాలు అమలు చేయడానికి సూచనలు చేయలేదు. 

ఆ వర్సిటీలు యథాతథమే
సబ్బవరంలోని న్యాయవిశ్వవిద్యాలయం హైకోర్టు పర్యవేక్షణలో నడుస్తోంది. ఇక మారిటైం యూనివర్సిటీ కేంద్రప్రభుత్వ పరిధిలో నడుస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వీటికి వర్తించదు.

నెరవేరని ఆశయం 
విశ్వవిద్యాలయాల పాలక మండలిలో పారిశ్రామిక వేత్తలు ఉండాలనే గత ప్రభుత్వ ఆశయం పూర్తిగా నీరుగారింది. ఏయూ పాలక మండలి సభ్యులుగా నియమితులైన గ్రంధి మల్లికార్జున రావు(జీఎంఆర్‌), డాక్టర్‌ మురళీ దివిలు  ఒక్క పాలక మండలి సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు.దీంతో వారు నామమాత్రమే అయ్యారు. పాలక మండలి సమావేశంలో చర్చించిన అంశాల ప్రగతిని, అమలును తర్వాత సమావేశం జరిగేలోగా యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌గా ఏయూ అధికారులు తయారు చేసి పాలక మండలి సభ్యులకు అందించాల్సి ఉంటుంది. దీన్ని అందించడంలో వర్సిటీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. వర్సిటీకి సంబంధించిన ఆర్థిక నిర్వహణ అనుమతులు, ఇతర అత్యవసర అనుమతులు అవసరమైన సందర్భాలలో మాత్రమే పాలక మండలి సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి ప్రతీ మూడు నెలలకు సామేశం జరగాల్సి ఉన్నప్పటికీ అది జరగలేదు.

సమర్థత, నిబద్ధత కలిగిన వారికే అవకాశం
పాత పాలక మండలి రద్దు కావడంతో త్వరలో నూతన పాలక మండలి ఏర్పాటు అవుతుందని ఆచార్యులు భావిస్తున్నారు. దీంతో పాలక మండలిలో స్థానం పొందడానికి ఆచార్యులు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నారు. సమర్థత, నిబద్ధత కలిగిన వారికే చోటు లభించే అవకాశం అవకాశం ఉంటుందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు