అదనపు బాధ్యతలతో బోధనకు దూరం

23 Dec, 2013 02:08 IST|Sakshi

 మార్కాపురం, న్యూస్‌లైన్: ఇన్‌చార్జ్‌ల పాలనతో జిల్లాలో విద్యాశాఖ గాడితప్పుతోంది. 56 మండలాల్లో కేవలం 9 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన మండలాల్లో లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. జిల్లావ్యాప్తంగా 424 ఉన్నత పాఠశాలలు, 2,942 ప్రాథమిక, 419 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఇదే సమయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పిల్లలకు పాఠాలు చెప్పలేకపోతున్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్‌షిప్‌ల పంపిణీ, ఏకరూప దుస్తులు, పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈఓలదే.

 ప్రస్తుతం జిల్లాలో కొమరోలు, దోర్నాల, సంతనూతలపాడు, అద్దంకి, మర్రిపూడి, కొరిశపాడు, కారంచేడు, ఉలవపాడు తదితర మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలుండగా మిగిలిన మండలాల్లో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. పదేళ్ల నుంచి ఎంఈఓల నియామకంపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి. జిల్లా పరిషత్ టీచర్లు, ప్రభుత్వ టీచర్ల మధ్య ఎంఈఓల పదోన్నతులు, నియామకాలపై సందిగ్ధత నెలకొంది. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలనలో విద్యాశాఖ నడుస్తోంది.  ప్రధానోపాధ్యాయులు పాఠశాలల తనిఖీలు, విద్యార్థుల ప్రగతి, పాఠశాల నిధుల వినియోగం, ఎస్‌ఎంసీ సమావేశాలు తదితర కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. వారిని ఎఫ్‌ఏసీ ఎంఈఓలుగా నియమించడంతో ఓ వైపు పాఠశాల నిర్వహణ, మరోవైపు ఎంఈఓల బాధ్యతలు భారంగా మారాయి. ఇరువైపులా పర్యవేక్షణ కష్టమవుతోంది.  
 ఇబ్బంది లేకుండా చూస్తున్నాం -రాజేశ్వరరావు, డీఈఓ
 రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓల సమస్య ఉంది. జిల్లాలో పదేళ్ల నుంచి రెగ్యులర్ ప్రతిపాదికపై ఎంఈఓల నియామకం లేకపోవడంతో సమీపంలో ఉన్న హెచ్‌ఎంలను ఎఫ్‌ఏసీ ఎంఈఓలుగా నియమించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.

మరిన్ని వార్తలు