కనికరం లేని కొడుకులు

13 Jun, 2016 01:23 IST|Sakshi

ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చాడు.. కడుపుకట్టుకుని పెంచి పెద్దచేశాడు.. సంపాదించిన ఆస్తిపాస్తులూ సమానంగానే పంచిపెట్టాడు.. బిడ్డలపై భారం కాకూడదని సొంతంగానే బతకడం నేర్చుకున్నాడు.. వయసు మీదపడింది.. బతుకు భారమైపోయింది.. భిక్షమెత్తినా భుక్తి దొరకడం గగనమైపోయింది.. అవసాన దశలో కన్నబిడ్డల చెంతే కన్నుమూయాలనుకున్నాడు.. కానీ కనికరం లేని ఆ కుమారులు రక్తం పంచి ఇచ్చిన తండ్రినే వద్దనుకున్నారు.. నిర్ధాక్షణ్యంగా రైల్వేస్టేషన్‌లో వదిలివెళ్లిపోయారు.. ఈ ఘటన కలికిరిలో ఆదివారం సంచలనం రేపింది.

 

 కలికిరి:కలికిరి పట్టణం అమరనాధరెడ్డి కాలనీలో వున్న కాములూరి బాషా(60)కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. కొడుకుల్లో  ఒకరు ఆర్టీసీబస్టాండ్ సమీపంలో టీస్టాల్ నడుపుతున్నాడు. మరొకరు తిమ్మారెడ్డి కాంప్లెక్స్‌కు ఎదురుగా బజ్జీలకొట్టు పెట్టుకున్నాడు. ఇంకో కుమారుడు సౌదీలో ఉంటున్నాడు. అందరూ ఆర్థికంగా స్థిరపడ్డా తండ్రిని పట్టించుకోక వదిలేశారు. చేసేదిలేక బాషా బెంగుళూరుకు వెళ్లిపోయాడు.  భిక్షాటన చేసుకుంటూ అక్కడ ఐదేళ్లు జీవించాడు. చివరి రోజుల్లో బిడ్డలను చూసి వారివద్ద తనువు చాలించాలనుకున్నాడు. రెండు రోజుల క్రితం కలికిరికి వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడిని కుమారులిద్దరూ రైల్వేస్టేషన్‌లో వదిలి చేతులు దులుపుకున్నారు. స్థానికులు గుర్తించి ఆదివారం రాత్రి ఎస్‌ఐ పురుషోత్తరెడ్డికి సమాచారమందించారు. ఎస్ బాషా కుమారులతో మాట్లాడినా వారు స్పందించకపోవడంతో వృద్ధుడిని స్టేషన్‌వద్దకు తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవసాన దశలో ఇంటికి వచ్చిన తండ్రిని వదిలించుకోవాలనుకున్న వారిపై స్థానికులు మండిపడుతున్నారు.

 

 

మరిన్ని వార్తలు