1.18 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్‌ పంపిణీ

6 Apr, 2020 03:38 IST|Sakshi

15 నుంచి చేపట్టే రెండవ విడత పంపిణీకి ఏర్పాట్లు 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని  

సాక్షి, అమరావతి:  లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమంలో ఇప్పటి వరకు 1,18,01,827 కుటుంబాలు (రేషన్‌ కార్డుదారులు) లబ్ధిపొందారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి క్యాంప్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గత నెల 29వ తేదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈనెల 14 వరకు కొనసాగుతుందని చెప్పారు.

ఈనెల 15వ తేదీ నుంచి రెండో విడత పంపిణీని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రెండో విడతలో బియ్యంతో పాటు ప్రతి రేషన్‌ కార్డుకు కేజీ శనగపప్పును ఉచితంగా అందజేస్తామన్నారు. రేషన్‌ షాపుల్లో రద్దీ నియంత్రణకు ఈసారి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వలంటీర్ల ద్వారా కూపన్‌లను జారీ చేసి వాటి ప్రకారం పంపిణీ చేస్తామన్నారు. కరోనా వైరస్‌ వల్ల రెడ్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్‌ సరుకులను సరఫరా చేస్తామన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ ఉచిత రేషన్‌ పంపిణీ చేపట్టారని తెలిపారు.

మరిన్ని వార్తలు