కొత్తకొత్తగా..

20 Jun, 2015 02:59 IST|Sakshi
కొత్తకొత్తగా..

- జిల్లాకు 77 జేఎన్‌ఎన్యూఆర్‌ఎం బస్సులు
- వచ్చే నెలాఖరుకు సిద్ధం
- తొలి ప్రాధాన్యంగా పుష్కరాల కోసం కేటాయింపు
సాక్షి, విజయవాడ :
జిల్లాకు మరో 77 కొత్త బస్సులు మంజూరయ్యాయి. ఈ ఏడాది మొదటి అర్థ సంవత్సరానికి జేఎన్‌ఎన్యూ ఆర్‌ఎం కింద ఈ బస్సులు మంజూరయ్యాయి. వాస్తవానికి రెండు నెలల కిందటే మంజూరైనప్పటికీ ఆర్టీసీ విభజన ప్రక్రియ, ఉద్యోగుల సమ్మె, ఇతర కారణాలతో కేటాయింపుల్లో కొంత ఆలస్యం జరిగింది. ఈ క్రమంలో ఎట్టకేలకు కేటాయింపు ప్రక్రియ ఖరారు కావడంతో వచ్చే నెలాఖరుకు బస్సులు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
 
అన్నీ విజయవాడ పరిధిలోకే..
జిల్లాలో ఇప్పటికే జేఎన్‌ఎన్యూఆర్‌ఎం బస్సులు దాదాపు 300 వరకు ఉన్నాయి. కాలంచెల్లిన బస్సుల్ని తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సుల్ని నడుపుతున్నారు. గత ఏడాది దశలవారీగా జిల్లాకు 150కుపైగా కొత్త బస్సులు మంజూరయ్యాయి. ఈ ఏడాది మొదటి ఆర్థిక సంవత్సరం నిధుల ద్వారా 90 బస్సుల్ని కేటాయించారు. వీటిలో 13 ఏసీ సర్వీసులు, మిగిలినవి 77 లోకల్ సబర్బన్ బస్సులు. ఏసీ బస్సులు మూడు నెలల కిందటే సిద్ధం కావడంతో వాటిని జిల్లాకు కేటాయించారు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు, గవర్నర్‌పేట, ఆటోనగర్ డిపోలకు కేటాయించారు. వచ్చే నెలాఖరులో వచ్చే 77 కొత్త బస్సులను కూడా నగరంలోని డిపోలకే మంజూరు చేయనున్నారు. వీటిని మెట్రో సర్వీస్ రూట్‌లో నడపనున్నారు. విజయవాడ-గుంటూరు, విజయవాడ-ఏలూరు, విజయ          వాడ-గుడివాడ, విజయవాడ, నందిగామ, విజయవాడ- తెనాలి తదితర రూట్లతో పాటు నగరంలో సిటీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా ఇవి నడుస్తాయి.
 
పాత బస్సుల స్థానే..

నగరంలో ఇప్పటికే 520 సిటీ సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ ఆర్డినరీ, డీలక్స్, మెట్రో సర్వీసులు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 12 నుంచి 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల్ని నిలిపివేసి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేయాలి. అలా ప్రస్తుతం 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు నగరంలో 25 ఉన్నాయి. ఈ క్రమంలో నూతనంగా మంజూరయ్యే 77 బస్సుల్లో 30 బస్సుల్ని సిటీ సర్వీసుకే కేటాయించనున్నారు. నగరంలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సగటున 70 శాతం వరకు ఉంటుంది. ఆక్యుపెన్సీ పెంచే దిశగా ఆర్టీసీ కొత్త సర్వీసుల ద్వారా ఎక్కువ స్టాప్స్ ఏర్పాటుచేసి సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రస్తుతం పుష్కరాలకు ఎక్కువ రద్దీ, వందల సంఖ్యలో అదనపు సర్వీసులు అవసరం ఉండటంతో ఇప్పటికే సిద్ధమైన బస్సులను తొలి ప్రాధాన్యతగా తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారు.

మరిన్ని వార్తలు