రీపోలింగ్‌కు కారణం ఎవరు?

19 May, 2019 11:59 IST|Sakshi

టీడీపీ డైరెక్షన్‌.. అధికారుల యాక్షన్‌

ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం వైఫల్యం

ఏ జిల్లాలో లేనన్ని వివాదాలు

స్వామి భక్తి చాటేందుకే.. ఈసీకి తప్పుడు నివేదికలు?

కమాండ్‌ కంట్రోల్‌ రూంలో షార్ట్‌ సర్క్యూట్‌ పథకంలో భాగమేనా?

ఇద్దరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధం?

సాక్షి, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. అయితే ఆయన విధానం తెర ముందు ఒకలా, తెర వెనుక మరోలా ప్రవర్తించారనే విషయం ప్రస్తుతం తేటతెల్లమవుతోంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ముగిసిన వెంటనే పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని, రీపోలింగ్‌కు తావేలేదని స్పష్టంచేశారు.

ఇదే విషయం ఈసీకి నివేదిక రూపంలో తెలియజేశారు. అయితే క్షేత్రస్థాయిలో పోలింగ్‌ రోజున పలు హింసాత్మక సంఘటనలు, టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, దాడులకు తెగబడడం జరిగింది. పోలింగ్‌ రోజున  పూతలపట్టు నియోజకవర్గంలో పలు పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.బాబుకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన ఆ పోలింగ్‌ బూత్‌ల వద్దకు వెళ్తున్న సమయంలో టీడీపీ నాయకులు అడ్డగించి ఆయన్ను తీవ్రంగా గాయపరిచి తల పగులగొట్టారు.

రామచంద్రాపురం మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు చేసిన దాడిలో గాయాలపాలయ్యారు. పెద్దతిప్పసముద్రం మండలంలో టీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకటరమణారెడ్డి మృతి చెందారు. ఇలా అనేక ఘటనలు, రిగ్గింగ్‌లు 14 నియోజకవర్గాల్లో  యథేచ్ఛగా జరిగాయి. ఈ విషయాలన్నీ జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌  దృష్టికి వచ్చినా తక్షణ చర్యలకు పాల్పడక నిర్లక్ష్యం చేశారు. జిల్లాలో జరిగిన ఘటనలపై వాస్తవ నివేదికలను ఈసీకి పంపకపోవడంతో ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. 
అన్నీ అనుమానాలే..
పోలింగ్‌ రోజున జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఏప్రిల్‌ 10న అర్ధరాత్రి అనూహ్యంగా మంటలు చేలరేగి కాలిపోయింది. ఆ ఘటన మరుసటిరోజు ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ నాయకుల డైరెక్షన్‌లో పోలింగ్‌ జరిగే రోజున ఘటనలను పర్యవేక్షించకూడదనే ఉద్దేశంతోనే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కాల్చివేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కాలిపోవడం వల్ల ఏప్రిల్‌ 11న జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న జిల్లాలో జరుగుతున్న పోలింగ్‌ సరళిని పర్యవేక్షించలేక చాంబర్‌లోనే మిన్నకుండిపోయారు. దీంతో పలుచోట్ల టీడీపీ నేతలు ఇష్టానుసారంగా రిగ్గింగ్‌కు, హింసాత్మక దాడులకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. 
వేటుకు రంగం సిద్ధం ?
పోలింగ్‌ ముందురోజున కలెక్టర్‌ ప్రద్యుమ్న తనతో మాట్లాడారని ఈవీఎంల దొంగతనం కేసులో నిందితుడు, టీడీపీ నాయకుడు వేమూరి హరిప్రసాద్‌ చౌదరి స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పడం ఆశ్చర్యాన్ని కల్పించింది. అదేవిధంగా పోలింగ్‌ పూర్తయిన తరువాత జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని ఏడు పోలింగ్‌ బూత్‌ల ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌లో లేకుండా బయటే ఉంచారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇలా ప్రతి దాన్నీ గమనిస్తే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ టీడీపీ నేతలకు ఏమేరకు సహకరించారో అర్థమవుతోంది.

చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేసిన రిగ్గింగ్‌ వీడియోలతో సహా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాల దృష్టికి వెళ్లడంతో వారు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్నపై, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌పై సీరియస్‌గా ఉన్నారని సమాచారం. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, ఓ పార్టీకి మద్దతు పలుకుతూ పనిచేశారనే ఆరోపణలకు గాను వారిద్దరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు