వైఎస్సార్‌ ‘చేనేత’ సాయం రూ.24 వేలు

5 Oct, 2019 08:42 IST|Sakshi
గ్రామ, వార్డు వలంటీర్లకు అవగాహన  కల్పిస్తున్న సుబ్బానాయుడు

సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : మగ్గం కలిగివున్న ప్రతి నేతన్నకూ ఏటా వైఎస్సార్‌ చేనేత సాయం రూ.24 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా జౌళి శాఖ ఏడీవో సుబ్బానాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ వలంటీర్లతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీవో లీలామాధవి అద్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఏడీవో మాట్లాడుతూ నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు ప్రభుత్వం చేయూతనిస్తోందని, అర్హులైన నేతన్నల ఎంపికను వలంటీర్లు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా మగ్గం ఉన్న నేతన్నలకు ‘వైఎస్సార్‌ చేనేత సాయం’ అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు వలంటీర్ల ద్వారా చేనేత కుటుంబాలను సర్వే చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 7611 చేనేత కుటుంబాలు ఉండగా మదనపల్లెలోనే 4900 ఉన్నట్లు 2018 నవంబర్, డిసెంబర్‌ నెలలో నిర్వహించిన సర్వే ఆధారంగా తేలిందన్నారు. ఇంకా చేనేత కుటుంబాలు ఉన్నట్లయితే రేపటి నుంచి చేపట్టబోయే రీ సర్వేలో గుర్తిస్తామని చెప్పారు.

చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక చేపడతామన్నారు. ఇందుకోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను నియమించినట్లు గుర్తుచేశారు. ఈ కమిటీల ఆమోదం ద్వారా ఇదివరకే జిల్లాలో 6821 మందిని గుర్తించి నివేదికను పంపించామన్నారు. మగ్గం లేనప్పటికీ కూలి, అద్దె మగ్గాలు నేస్తున్న వారు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ, రూరల్‌ పరిధిలోని వలంటీర్లు, చేనేత జవిళి సంఘం నాయకులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు