సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

24 Aug, 2019 20:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సెప్టెంబరు 1 నుంచి జరిగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. అవి

  • పంచాయతీ సెక్రటరీ, విఆర్‌వో, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, ఎఎన్‌ఎమ్‌ ఉద్యోగాలకు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి.
  • 374 సెంటర్లలో 200655 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ సంఖ్యలో పరీక్ష ఎప్పుడూ జరగలేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
  • పరీక్షలు ఉదయం 10 నుండి 12వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు అరగంట ముందు పరీక్ష హాల్లో ఉండాలి. ఓఎమ్‌ఆర్‌ షీట్లలో పరీక్ష ఉంటుంది.
  • సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. పరీక్ష నిర్వహించడానికి 8 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. పటిష్ట భద్రత నడుమ ప్రశ్రపత్రాల తరలింపు ఉంటుంది.
  • ప్రతి సెంటర్‌కు చీఫ్‌ సూపరింటెండ్‌తో పాటు స్పెషల్‌ ఆఫీసర్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, రూట్‌ ఆఫీసర్‌లను నియమించాం. ప్రతి బస్టాండ్‌లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశాం.
  • ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష జరిగే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది.
  • పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జీరాక్స్‌ సెంటర్లను మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.

మరోవైపు రేషన్‌ అందదనే అపోహలు వద్దని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ వలంటీర్లు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ప్రతీ ఇంటినీ సర్వే చేస్తారనీ, ప్రజలు తమ సమాచారాన్ని సరైన రీతిలో ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి తీసుకున్న సమాచారాన్ని వలంటీర్లు తహసీల్దార్లకు అందజేస్తారు. అంతేకాక, ఈ కేవైసీ నమోదు చేయనివారు దాదాపు 3 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నామనీ, ఈ కేవైసీని సంబంధిత రేషన్‌ షాపుల్లో నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు