కలిసే.. కానరాని లోకాలకు!

18 May, 2015 04:48 IST|Sakshi
కలిసే.. కానరాని లోకాలకు!

గుమ్మిలేరులో విషాదఛాయలు  
 స్వగ్రామానికి మృతదేహాలు
 అంత్యక్రియలు పూర్తి
 ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ

 
 గుమ్మిలేరు (ఆలమూరు) :తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బిచ్‌పల్లి మండలం చాంద్రాయన పల్లిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గుమ్మిలేరుకు చెందిన దంపతులు మృతి చెందారు. ఫలితంగా  గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన రెడ్డి గంగరాజు కుమారుడు ప్రవీణ్‌కుమార్ (28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఉదయనాగిని (26) కూడా ఫిజియోథెరపిస్టుగా పనిచేసున్నారు. వీరు అక్కడే తార్నాకలో నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం వీరిద్దరికీ వివాహమైంది.
 
 ఈ దంపతులకు ఏడాది వయస్సున్న  కుమార్తె ఉంది. పేరు శ్రీత. ఆమె నిజామాబాద్‌జిల్లా ఎడవల్లి మండలం జైతాపురంలోని ప్రవీణ్ అత్తవారింటి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో శని వారం వారాంతపు సెలవు కావడంతో ప్రవీణ్, నాగిని కుమార్తెను చూసేందుకు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో చాంద్రాయనపల్లి వద్ద  టైర్ పేలి పోవడంతో వీరు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఫలితంగా దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆది వారం వీరి మృతదేహాలను గుమ్మిలేరుకు తీసుకొచ్చారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
 ప్రవీణ్ పదోన్నతిపై పూణే వెళ్లాల్సి ఉంది
 సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన ప్రవీణ్‌కుమార్ పదోన్నతిపై పూణే వెళ్లి  మరొక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆదివారం చేరాల్సి ఉంది. అదే సమయానికి స్వగ్రామానికి ప్రవీణ్ విగతజీవిగా రావడాన్ని కుటుంబీకులు తట్టుకోలేకపోతున్నారు.    ప్రవీణ్, ఉదయ నాగిని మృతదేహాలకు ఆదివారం రాజమండ్రిలోని కోటిలింగాల రేవు శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.  
 
 ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ
 ప్రమాద విషయం తెలిసిన వెంటనే కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహూటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి గుమ్మిలేరు చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాలను త్వరగా స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక దృష్టిసారించి                              పర్యవేక్షించారు.  
 

మరిన్ని వార్తలు