సీఎంకు జిల్లా సమగ్ర నివేదిక

7 Aug, 2014 02:26 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా అభివృద్ధి, ఆదాయ వనరులు, ఇతర అంశాలతో కూడిన సమగ్ర నివేదికను అధికార యంత్రాంగం తయా రు చేసింది. గురువారం విజయవాడలో జరిగే సదస్సులో సీఎం చంద్రబాబునాయుడికి కలెక్టర్ దీనిని అందజేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా భౌగోళికాంశాలపై కలెక్టర్ ముదావత్ మల్లికార్జున నాయక్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. అందుకు తగ్గట్టుగా పది అంశాలతో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నివేదికతో కలెక్టర్  బుధవారం ఉదయం విజయవాడ బయలుదేరి వెళ్లారు.  పారిశ్రామిక అవకాశాలు, అందుకు అనువుగా ఉన్న భూములు,  ఏ విధంగా వినియోగించడానికి అనువుగా ఉంటాయన్న వివరాలతో  ముఖ్య ప్రణాళికాధికారి ద్వారా ఒక నోట్‌ను తయారు చేశారు. ఈ నోట్‌లో జిల్లాకు సంబంధించిన అన్ని ప్రణాళికాంశాలనూ పొందుపరిచినట్టు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
 
 జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన ఆదాయ వివరాలను నోట్‌లో పొందుపరిచారు. ఏయే శాఖ నుంచి ఎంత ఆదాయం వస్తోంది..  ఏ శాఖ నుంచి సామాజికావసరాలకు ఎంత వ్యయం అవుతోంది, రాబోయే ఐదేళ్లలో జిల్లాలో ఉన్న ప్రధాన శాఖల ద్వారా రావాల్సిన ఆదాయం,  వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు జరిగే వ్యయాన్ని కూడా లెక్కేసి అంచనాలు తయారు చేశారు. ఈ అంచనాల ద్వారా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలు ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. జిల్లా స్థూల జాతీయోత్పత్తిని కూడా అంచనా వేసి దానిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పొందుపరచనున్నారు. రాబోయే ఐదేళ్లలో వ్యవసాయ రంగానికి అవసరమైన పనులు, నిధుల వివరాలపై అంచనాలు తయారు చేశారు. ఈ రంగంలో ఉన్న అవసరాలు, రెవెన్యూ, ఉత్పత్తి వంటి అంశాలను కూడా పొందుపరిచి సీఎం ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో వ్యవసాయంతో పాటు సెరీకల్చర్, హార్టికల్చర్, పశుసంవర్థక, మత్స్య శాఖల ఉత్పత్తులను పొందుపరిచి వివరించనున్నారు.
 
 ముఖ్యంగా ప్రైమరీ ఇండస్ట్రీస్ వివరాలకు సంబంధించి వివరాలను సిద్ధం చేశారు. ఈ నోట్‌లో జిల్లాలోని ఏపీఐఐసీ ద్వారా సేకరించిన భూములు, అందులో వినియోగంలో ఉన్న భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? అన్న అంశాలను ముఖ్యమంత్రి ముందు పెట్టనున్నారు. ఈ భూముల్లో ఇప్పటివరకూ ఎన్ని పరిశ్రమలు పెట్టారు? అందులో నడుస్తున్నవెన్ని? ప్రారంభంకానివి ఎన్ని అన్న విషయాలను పొందుపరిచారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూముల వివరాలను కూడా సిద్ధం చేశారు. జిల్లాలోని టూరిజం శాఖ ద్వారా లభించే అవకాశమున్న ఆదాయ వనరుల వివరాలను సేకరించారు. బొబ్బిలి, విజయనగరం, ఎస్.కోట వంటి ప్రాంతాల్లో టూరిజం ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశముందన్న విషయాలను కలెక్టర్ నాయక్ నోట్‌లో పొందుపరిచారు.   దేవాదాయ శాఖ ద్వారా లభించే ఆదాయ వివరాలను పొందుపరిచి, భవిష్యత్తులో వచ్చే ఆదాయ వివరాలను సిద్ధం చేశారు. మొత్తం అన్ని శాఖల ద్వారా రానున్న ఆదాయ వనరులను ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అలాగే గిరిజన యూనివర్సిటీ, వైద్య కళాశాల తదితర వాటికి సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు