పొట్టి రవిపై జిల్లా బహిష్కరణ వేటు 

4 Dec, 2019 07:52 IST|Sakshi

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో అసాంఘిక శక్తిగా చలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్‌వీ రవీంద్రారెడ్డి అలియాస్‌ పొట్టి రవిపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న ఎస్‌వీ రవీంద్రారెడ్డి పాతికేళ్లుగా తాడిపత్రిని శాసించాడు. తాడిపత్రి మండలం, దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి వీరారెడ్డి కుమారుడైన సంగటి రవీంద్రారెడ్డి 2003లో జేసీ సోదరుల పంచన చేరాడు. మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి నమ్మిన బంటుగా మారడంతో వారు పూర్తి అండదండలు అందించారు. దీంతో రవి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది.

హత్యాయత్నం, దొమ్మి, మారణాయుధాలు కలిగి ఉండటం తదితర 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ అప్పటి జిల్లా ఎస్పీలు ఆయన జోలికి వెళ్లడానికి సాహసించలేదు. 2003లో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటన, 2004లో అక్రమ ఆయుధాలు కలిగి ఉండడంపై కేసులు నమోదు అయ్యాయి. 2015లో అల్ట్రాటెక్ట్‌ సిమెంట్‌ పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసు, 2017లో తాడిపత్రి మండలం, పెద్దపొలమడ గ్రామం సమీపంలోని ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన వాటర్‌ ట్యాంక్‌ దగ్ధం కేసులో రవీంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నాడు. 2018లో వినాయక చవితి నిమజ్జన సందర్భంగా చేలరేగిన ఘర్షణలో కేసులు నమోదు అయ్యాయి.

2019లో వీరాపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఇవే కాకుండా పొట్టిరవి చేసిన దాడులు దౌర్జన్యాలు, దందాలకు ఎన్నో ఉన్నాయి. అయితే తాడిపత్రిలో పాతిక సంవత్సరాలు జేసీ బ్రదర్స్‌దే సామ్రాజం కావడంతో ఇతనిపై ఫిర్యాదు చేయడానికి బాధితులు సాహసించ లేదు. కొంత మంది పోలీస్‌స్టేషన్‌ల వరకు వెళ్లినా  అక్కడి పోలీసులు పంచాయతీ చేసి పంపించిన సందర్భాలున్నాయి.
 
ఎస్పీ సత్య యేసుబాబు కొరడా 
జిల్లా ఎస్పీగా బూసారపు సత్య యేసుబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసాంఘిక శక్తులను అణచివేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ముఖ్యంగా తాడిపత్రిలో మట్కా, క్రికెట్‌ బెట్టింగ్, సెటిల్‌మెంట్‌లకు పాల్పడిన వారిని ఏరివేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా వీరాపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డిని హత్య చేయాలని పొట్టి రవి కుట్ర పన్నగా...పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. దీంతో పొట్టి రవి అరాచాకాలు ఎస్పీ దృష్టి వెళ్లాయి. దీంతో ఆయన రవిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. తాజాగా జిల్లా బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు