‘స్త్రీనిధి’ రికవరీలో జిల్లా ప్రథమస్థానం

16 Feb, 2014 02:51 IST|Sakshi

 నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ : స్త్రీనిధి ద్వారా ఈ ఏడాది లక్ష్యానికి మించి రుణాలు అందించామని, అలాగే  లబ్ధిదారుల నుంచి రికవరీ చేయడంలో జిల్లా ప్రథమస్థానంలో ఉందని స్త్రీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవికుమార్ పేర్కొన్నారు. మండలంలోని లింగంపల్లికలాన్‌లో రుణాలను పొందిన లబ్ధిదారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. స్త్రీనిధి ద్వారా రుణాలు పొందడం వల్ల కలిగిన ప్రయోజనాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం వల్ల తిరిగి ఎక్కువ డబ్బులను రుణంగా పొందవచ్చని ఆయన సూచించారు.

 అనంతరం మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది స్త్రీనిధి ద్వారా 122కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా ఉందన్నారు. ఇప్పటివరకు 127కోట్లను రుణాలుగా ఇచ్చామని, మార్చి ఆఖరు వరకు మరో 20కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ ఏడాది లక్ష్యానికిమించి స్త్రీనిధి ద్వారా మహిళలకు రుణాలు అందించామన్నారు. జిల్లాలో రుణాల రికవరీ ఇప్పటి వరకు 99.5శాతం జరిగిందని ఆయన వివరించారు. జిల్లాలోని స్త్రీనిధి పథకం ద్వారా అత్యధికంగా కోటగిరి మండలంలో 5కోట్ల75లక్షలు రుణాలుగా ఇచ్చామని, తర్వాత బోధన్ మండలంలో 5కోట్ల68లక్షలు ఇచ్చామని ఆయన చెప్పారు.
 రైతులకు రుణాలు
 ఎల్లారెడ్డి, బాన్సువాడ బీఎంసీల పరిధిలో రైతులకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందించడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైతులకు రుణాలను ఇస్తామని ఏజీఎం పేర్కొన్నారు. స్త్రీనిధి రుణాల వినియోగంపై ప్రస్తుతం మొదటివిడతగా జిల్లాలో లింగంపేట మండలంలోని పర్మళ్ల, కోర్పొల్, పోతాయిపల్లితోపాటు డిచ్‌పల్లి మండలంలోని ఇందల్వాయి గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. రెండోవిడతలో నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లికలాన్, నిజాంసాగర్ మండలం సింగితం గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయనవెంట ఏపీఎం మహేష్‌కుమార్, సిబ్బంది రాజు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు