స్టౌలు సరే... గ్యాస్ కనెక్షన్లేవీ ?

5 Jul, 2014 05:01 IST|Sakshi

- పొగచూరుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు
- సక్రమంగా అమలుకాని 'అమృతహస్తం' పథకం

చిత్తూరు(టౌన్): జిల్లాలో అమలవుతున్న 'అమృతహస్తం' పథకం పొగచూరుతోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా అంగన్‌వాడీలకు ఇంతవరకు గ్యాస్ కనెక్షన్లు అందలేదు. ఈ పథకం అమలవుతున్న అన్ని కేంద్రాల్లో కట్టెల పొయ్యిలపైనే ఆధారపడి వంట చేస్తున్నారు.  కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో అంగన్‌వాడీ కేం ద్రాలు మసిబారుతున్నాయి. గర్భిణు లు, బాలింతల సంక్షేమం కోసం కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2013 నుంచి 'అమృతహస్తం' అనే పథకాన్ని రెండు విడతలుగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,629 అంగన్‌వాడీల్లో ఈ పథకం అమలవుతోంది.

గ్రామాల్లో గర్భిణులు, బాలిం తలను గుర్తించి వారికి అంగన్‌వాడీల నుంచి పౌష్టికాహారాన్ని అందించడమే ఈ పథక  ఉద్దేశం. లబ్ధిదారులకు  నెలలో 16 కోడిగుడ్లు, రోజూ మధ్యాహ్నం పూట 200 గ్రాముల పాలు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పు తో భోజనం అందిస్తారు. భోజనాన్ని లబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రాలకే వచ్చి  తినేసి వెళ్లాలి. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు  30, 344 మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అక్కడికక్కడే వండి అందించాలనే ప్రభుత్వ నిబంధన ఉన్నా ఒక్క కేంద్రానికి కూడా గ్యాస్ కనెక్షన్ లేదు.

ఒకవేళ ఉన్నా అది సంబంధిత అంగన్‌వాడీ హెల్పర్ ఇంటి వద్ద నుంచో, వారి సొంత డబ్బులతోనో తెచ్చుకున్నదే. రెండేళ్లకు ముందే 1,100 గ్యాస్ స్టౌలను ఐసీడీఎస్ అధికారులు టెండర్ల ద్వారా కొనుగోలు చేశారు. గ్యాస్ కనెక్షన్ల మంజూరు గురించి మాత్రం పట్టించుకోలేదు. నెల రోజుల కిందట అన్ని కేంద్రాలకు ఒక్కో కనెక్షన్‌కు రూ. 5 వేలు చొప్పున చెక్కులను అందజేశారు. అయితే ఇది కార్యరూపం దాల్చడంలో ఆలస్యమవుతోంది.
 
ఆధిపత్యపోరు
లబ్ధిదారుల పౌష్టికాహారానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం వీవో (గ్రామసమాఖ్యలు)ల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది. అయితే తాము ఖర్చుపెట్టి పౌష్టికాహారాన్ని అందిస్తుంటే వీవోల ఖాతాల్లోకి జమచేయడం ఏంటంటూ అంగన్‌వాడీ వర్కర్లు,హెల్పర్లు వాది స్తున్నారు. ప్రభుత్వ నిబందనల ప్రకా రం వంటవండి వడ్డించడం హెల్పర్ల వంతయితే, వండడానికి అవసరమైన వస్తువులు వీవోలే కొనివ్వాలి. అందు కు వారి ఖాతాల్లోకే డబ్బులు పడుతున్నాయి. కానీ పలుచోట్ల అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఖర్చుపెట్టి వండిన తర్వాత వడ్డించే సమయంలో వీవోలు ప్రత్యక్షమై పెత్తనం చెలాయిస్తున్నారు.

దీన్ని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు  జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంగా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేధాలు ఉన్నాయి. దీని ప్రభావం పథకంపై పడుతోంది. లబ్ధిదారులకు పాలు, ఆకుకూరలు, కూరగాయలు లే ని చప్పిడి భోజనం అందుతోంది. ని ధులు ఖర్చయిపోతున్నారుు. ప్రభుత్వ ఆశయం మాత్రం నీరుగారిపోతోంది.
 
సేఫ్టీ మెజర్స్ తర్వాత వాడకం
అమృతహస్తం అమలయ్యే అన్ని కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్ల కోసం చెక్కులిచ్చాం. కొన్నింటికి కనెక్షన్లు వచ్చాయి. చాలావాటికి గ్యాస్ కంపెనీల నుంచి అనుమతులు రావడంలో ఆలస్యమవుతోంది. మంజూరైన వాటికి సేఫ్టీ మెజర్స్‌పై శిక్షణ ఇచ్చిన తర్వాత వాడకాన్ని చేపడతారు. అంతవరకు కొంత ఇబ్బంది తప్పదు.

మరిన్ని వార్తలు