గంటా పిలిచారు... వచ్చారు.. వెళ్లారు

29 Jan, 2015 04:08 IST|Sakshi
గంటా పిలిచారు... వచ్చారు.. వెళ్లారు

సాక్షి  ప్రతినిధి, ఒంగోలు : మంత్రి గంటా శ్రీనివాసరావు పిలిచారు. వచ్చాం ..వెళ్లాం అన్న చందంగా మంత్రుల పర్యటన జిల్లాలో సాగింది. ఒకేసారి ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు జిల్లాకు వచ్చారంటే ఓ మంచి అభివృద్ధి పథకం ప్రకటనలో, కనీసం హామీ అయినా దక్కుతుందన్న జిల్లా ప్రజలకు నిరాశే ఎదురయింది. దీనికి భిన్నంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారు. ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు మాత్రం స్వైన్‌ఫ్లూపై సమీక్షించి, డీఎంఈతో తనిఖీలు నిర్వహించనున్నట్లు ప్రకటించి వెళ్లారు.

రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తన స్వగ్రామమైన కామేపల్లిలో ‘బడిలో బస’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం బుధవారం ఉదయానికల్లా వివిధ మార్గాల్లో ఎనిమిది మంది మంత్రులు ఒంగోలు చేరుకొని ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి జాతీయ రహదారిపై ఉన్న వల్లూరమ్మ దేవస్థానంలో గత ప్రభుత్వ కాలంలో మంజూరై నిర్మాణాలు పూర్తి చేసుకున్న రెండు ప్రాకార మండపాలు, షాపింగ్ కాంప్లెక్సులను ప్రారంభించారు.

అనంతరం కె బిట్రగుంటలో ఎన్టీఆర్ సుజలస్రవంతి కార్యక్రమంతోపాటు కామేపల్లి గ్రామంలో పోలేరమ్మ గుడికి రూ.40 లక్షలతో మండపం, రూ.25 లక్షలతో ప్రహరీ ముఖ ద్వారం, రూ.23 లక్షలతో గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం, కామేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌ను రూ.2 కోట్ల 36 లక్షలతో మోడల్ స్కూల్‌గా మార్చటానికి శంకుస్థాపనలు  చేశారు. గ్రామంలో రూ.1 కోటి 32 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్లు, రామచంద్రాపురం నల్లవాగు మీద రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి గంటాతోపాటు మంత్రులు ప్రారంభించారు.

మంత్రి శిద్దా రాఘవరావు, పల్లె రఘునాధరెడ్డిలు చాగల్లు వద్ద జాతీయ రహదారిపై దగ్ధమైన బస్సును పరిశీలించి విచారణకు ఆదేశించారు. మరోవైపు కందుకూరులో మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి దివి శివరామ్, అతని వ్యతిరేక వర్గం మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. దివి శివరామ్ ఇచ్చిన అల్పాహార విందుకు వ్యతిరేక వర్గం దూరంగా ఉంది.

మరిన్ని వార్తలు