జిల్లాలో ఇసుక కొరత లేదు: జాయింట్‌ కలెక్టర్‌

21 Nov, 2019 10:04 IST|Sakshi
కానూరు–పెండ్యాల ర్యాంపులో ఇసుకను పరిశీలిస్తున్న జేసీ వేణుగోపాల్‌రెడ్డి చిత్రంలో  నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, అధికారులు

సాక్షి, పెరవలి(పశ్చిమ గోదావరి): జిల్లాలో ఇసుక కొరత లేదని.. రోజుకు 20 వేల టన్నులు లభిస్తుందని, జిల్లా అవసరాలు పోను మిగిలింది ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నామని జిల్లా జాయింట్‌ కలక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఇసుక వారోత్సవాల సందర్భంగా కానూరు–పెండ్యాల  ఇసుక ర్యాంపును బుధవారం ఆయన ప్రారంభించారు. జిల్లాలో 22 రీచ్‌ల ద్వారా ఇసుక తీస్తున్నామని, ఓపెన్‌ రీచ్‌లు అయిన ఖండవల్లి నుంచి ఇసుక సరఫరా అవుతుందని, వారం రోజుల్లో ఉసులుమర్రు, కానూరు–పెండ్యాల ర్యాంపుల నుంచి కూడా ఇసుక లభ్యమవుతుందని చెప్పారు. దీంతోపాటు కొత్త రీచ్‌ల కోసం సిఫార్సులు చేస్తున్నామని వాటికి అనుమతులు వస్తే ఇసుక రాష్ట్రం అంతా సరఫరా చేయవచ్చన్నారు.  

డ్రెడ్జింగ్‌కు అనుమతులు 
గోదావరిలో ఆనకట్టపైన ఉన్న ప్రాంతాల్లో డ్రెడ్జింగ్‌ చేయటానికి అనుమతులు వచ్చాయని దీని ద్వారా కూడా ఇసుక లభ్యమవుతుందని జేసీ తెలిపారు. డ్రెడ్జింగ్‌కు టెండర్లు పిలుస్తున్నామని అవి పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. దీని కోసం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ఇలా చేయడం ద్వారా గోదావరిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు.  

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు 
జిల్లా సరిహద్దు అయిన చింతలపూడి నుంచి కుక్కునూరు వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. ఇందుకోసం రెవెన్యూ, మైనింగ్, రవాణా, పోలీస్, పంచాయతీరాజ్‌ అధికారులను నియమించామన్నారు. అక్రమంగా ఇసుక తరలించినా, నిల్వ చేసినా, ఇతర ప్రాంతాలకు తరలించినా రెండేళ్ల జైలు, రూ.2 లక్షల జరిమానా తప్పదని హెచ్చరించారు.  

స్టాకు యార్డుల ఏర్పాటు 
జిల్లాలో ఇసుకను లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించటానికి ప్రధాన పట్టణాలతో పాటు డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో స్టాకుయార్డులను ఏర్పాటు చేస్తున్నామని జేసీ తెలిపారు. ఏలూరు, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, జంగారెడ్డి గూడెం, తణుకు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యార్డుల వద్దే ఇసుక ధరలు పట్టిక కూడ ఉంటుందని, అంతకుమించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇసుక తోలటానికి 500 వాహనాలకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటికి జీపీఎస్‌ అమర్చుతామని దీని వలన వాహనం ఎక్కడ ఉందో తెలుస్తుందని తెలిపారు. జీపీఎస్‌ విధానాన్ని సక్రమంగా అమలు చేయడానికి బృందాన్ని ఏర్పాటుచేస్తామని, పది రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయన్నారు.  

కొత్త ర్యాంపులకు సిఫార్సు 
జిల్లాలో గోదావరి ప్రాంతంలో కొత్త ర్యాంపుల ఏర్పాటు చేయటానికి సిఫార్సులు పంపించామని అనుమతులు వచ్చిన వెంటనే వాటిని ఏర్పాటు చేస్తామని జేసీ తెలిపారు. ఇలా చేస్తే జిల్లా అవసరాలతో పాటు రాష్ట్రం నలుమూలకు ఇసుక సరఫరా చేయవచ్చన్నారు.  

ఇసుక మాఫియాకు చెల్లు 
ఇసుక ర్యాంపుల్లో మాఫియా ఆగడాలకు కాలం చెల్లిందని దళారీ వ్యవస్థ లేకుండా చేయటమే తమ ముందున్న లక్ష్యమని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దోచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తే తమ ప్రభుత్వం ప్రజలకు సేవలు చేయటానికి కృషి చేస్తుందన్నారు. ఇసుక అమ్మకాల్లో అక్రమాలకు తావులేకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, కేంద్రపార్టీ రాజకీయ సలహాదారుడు జీఎస్‌ రావు, జిల్లా మైనింగ్‌ డీడీ వైఎస్‌ బాబు, ఏపీఎండీసీ జిల్లా ఇన్‌చార్జి గంగాధరరావు, కొవ్వూరు ఆర్డీఓ నవ్య, తహసీల్దార్‌ పద్మావతి, మండల కనీ్వనర్‌ కార్చెర్ల ప్రసాద్, ఉపాధ్యక్షుడు కొమ్మిశెట్టి రాము, యూత్‌ ప్రెసిడెంట్‌ తోట సురేష్, కరుటూరి గోపి, నిడదవోలు పట్టణ, రూరల్‌ కనీ్వనర్లు మద్దిపాటి ఫణీంద్ర, అయినీడి పల్లారావు  వైíసీపీ నాయకులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు