సరిలేరు మీకెవ్వరూ..!  

28 Nov, 2019 07:56 IST|Sakshi

విభిన్న ప్రతిభావంతుల  క్రీడాపోటీలను ప్రారంభించిన  కలెక్టర్‌ నివాస్‌

అదరగొట్టిన దివ్యాంగులు 

శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగులు సకలాంగులకు ఏమాత్రం తీసిపోరని, ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తా రని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్‌) కళాశాల మైదానంలో బుధవారం విభిన్న ప్రతిభావంతుల జిల్లాస్థాయి క్రీడా పోటీలు జరిగాయి. జిల్లా విభిన్నప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సత్తాకలిగిన దివ్యాంగ క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పారా ఒలింపిక్స్‌ పోటీ ల్లో పాల్గొని పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఏడీ కె.జీవన్‌బాబు మాట్లాడుతూ ఇక్క డ రాణించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ రాణించి విజేతలగా నిలిస్తే జాతీయ పోటీలకు వెళ్లే అవకాశముందన్నారు.కార్యక్రమంలో జిల్లా చీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.రమణ, కార్య దర్శి ఎం.సాంబమూర్తి, కార్యనిర్వహణ కార్య దర్శి ఎస్‌.సూరిబాబు, వై.పోలినాయుడు, దివ్యాంగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎంకే మిశ్రా, జిల్లా దివ్యాంగ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, విభిన్న సంస్థల నిర్వాహకులు, పీఈటీలు పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌.. 
అంతకుముందు కలెక్టర్‌ నివాస్‌ జాతీయ పతాకాన్ని ఎగురువేసి గౌరవ వందనం సమర్పించారు. ఏడీ జీవన్‌బాబు క్రీడల పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు బెలూన్లను నింగికి విడిచిపెట్టారు. 100 మీటర్ల ట్రైసైకిల్‌ రేస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 250 మంది విభిన్నప్రతిభావంతులు హాజరయ్యారు. ఎన్‌సీసీ క్యాడెట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు విభిన్న ప్రతిభావంతులకు అమూల్యమైన సేవలు అందించారు.

 కోలాహలంగా సాగిన పోటీలు.. 
6 నుంచి 15 ఏళ్లలోపు జూనియర్స్‌ విభాగం, 15 ఏళ్లు పైబడినవారిని సీనియర్స్‌ విభాగంగా బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. టోటల్లీ బ్లైండ్, హియరింగ్, ఆర్థోపిడికల్లీ, మెంటల్లీ రిటార్డెడ్‌ కేటగిరీల్లో పోటీలు జరిగాయి. అథ్లెటిక్స్‌ ఈవెంట్స్‌లో రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, సాఫ్ట్‌బాల్‌త్రోలో పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్‌ రేస్‌తోపాటు చెస్, క్యారమ్స్, క్రికెట్, వాలీబాల్, సింగింగ్, నృత్యం తదితర అంశాలలో హుషారుగా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఒక వ్యక్తి రెండు ఈవెంట్స్‌లలోనే పాల్గొనాలని అధికారులు షరతు పెట్టడంతో కొంతమంది నిరాశ చెందారు.    

మరిన్ని వార్తలు