-

దైవసాక్షిగా..

18 Jun, 2019 08:40 IST|Sakshi
పార్లమెంటు వద్ద విజయసాయిరెడ్డితో ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప

ప్రమాణస్వీకారం చేసిన జిల్లా ఎంపీలు

మొదటిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన ఇద్దరు

లోకసభా పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

సాక్షి, తిరుపతి: జిల్లా నుంచి గెలుపొందిన  ముగ్గురు పార్లమెంటు సభ్యులు సోమవారం లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో మూడు ఎంపీ స్థానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేయడం తెలిసిందే. ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా అక్షర క్రమంలో తొలుత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంట్‌ సభ్యులకు అవకాశం వచ్చింది. అందులో జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్‌ స్థానాల నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, దుర్గాప్రసాద్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.వీరిలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రెండోసారి ఎంపీగా పోటీచేసి భారీ ఆధిక్యతతో గెలుపొందారు.

రెడ్డెప్ప, దుర్గాప్రసాద్‌ మొదటిసారిగా పార్లమెంట్‌కు పోటీచేసి విజయం సాధించారు. వీరిద్దరు సోమవారం మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లోకసభా పక్షనేతగా ఎంపికైన విషయం విదితమే.  2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ 3 ఎంపీ స్థానాలతో పాటు 13 శాసనసభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. కుప్పం మెజారిటీతో చిత్తూరు పార్లమెంట్‌ను దక్కించుకుంటూ వస్తున్న టీడీపీకి ఈ సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబుకు షాక్‌ ఇచ్చాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంలో కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీకి అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. చిత్తూరు పార్లమెంటు స్థానం కూడా వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.  

మరిన్ని వార్తలు