మూసేస్తాం..

12 Feb, 2015 03:13 IST|Sakshi
మూసేస్తాం..

నిధులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన కళాశాలల హెచ్‌డబ్ల్యూఓలు
ఓపిక పట్టాలన్న డీబీసీడబ్ల్యూఓ
జిల్లాలో బకాయిలు రూ.2.05 కోట్లు

 
కర్నూలు(అర్బన్) : బీసీ కళాశాల వసతి గృహాలకు వెంటనే పెండింగ్‌లో ఉన్న బడ్జెట్‌ను విడుదల చేయకుంటే హాస్టళ్లను మూసి వేస్తామని బీసీలోని బీసీ కళాశాల వసతి గృహ సంక్షేమాధికారులు తెగేసి చెప్పారు. బుధవారం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 28 మంది హెచ్‌డబ్ల్యూఓలు జిలా బీసీ సంక్షేమాధికారి బి. సంజీవరాజును కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా వివరించారు. 2014 ఆగష్టు నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్‌ను విడుదల చేయకపోవడంతో ఒక్కో హెచ్‌డబ్ల్యూఓ లక్షల రూపాయల్లో అప్పులు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన డైట్‌కు కూడా బడ్జెట్ విడుదల చేయకుంటే సరుకులు ఎక్కడి నుంచి తెచ్చి వండి పెట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం మాత్రం ప్రభుత్వం సరఫరా చేస్తుండగా, మిగిలిన ఉప్పు, పప్పు, చింతపండు, కారం, నూనె, కూరగాయలు, పాలు, పెరుగు, కోడిగుడ్లు తదితర సరుకులన్నింటిని బయటి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సిందేనన్నారు.

అప్పులు చేసి నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడమే కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి యజమానులు అద్దెలు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లు కట్ చేస్తామని విద్యుత్‌శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా బడ్జెట్‌ను విడుదల చేయకుంటే వసతి గృహాలను నడపలేమని వారు స్పష్టం చేశారు. దీంతో జిల్లా బీసీ సంక్షేమాధికారి బి. సంజీవరాజు వెంటనే బీసీ సంక్షేమశాఖ డెరైక్టరేట్‌కు ఫోన్ చేసి జిల్లాలోని బీసీ కళాశాలలకు చెందిన బడ్జెట్ విడుదలపై వాకబు చేశారు.

ఒక వారం రోజులు ఓపిక పడితే బడ్జెట్ విడుదల చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీంతో ఈ నెల 20వ తేదీలోగా బడ్జెట్ విడుదల కాకపోతే హాస్టళ్లకు తాళాలు వేసి జిల్లా అధికారికి అందజేస్తామని హెచ్‌డబ్ల్యూఓలు చెప్పారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమాధికారి మాట్లాడుతూ..  డైట్, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు కలిపి సెప్టెంబర్ నుంచి జనవరి వరకు మొత్తం రూ.2,05,62,095 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. డైట్‌కు రూ.1,72,18,740, ఇంటి అద్దెలు రూ.29,13,355, విద్యుత్ బిల్లులు రూ. 4,30,000లను చెల్లించాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు