రాజాంలో రచ్చ!

28 Jun, 2016 00:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో అధికారుల బదిలీల నుంచి ప్రభుత్వపరంగా తీసుకొనే నిర్ణయాల వరకూ ప్రతి విషయంలో తమదే పైచేయి అని నిరూపించుకునేందుకు ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు వర్గం, మరోవైపు కిమిడి కళా వెంకటరావు వర్గం యథాశక్త్తి ప్రయత్నం చేస్తున్నాయి. మంత్రి ప్రత్యర్థి వర్గం తమ పంతం నెగ్గించుకునేందుకు వీలైతే పొరుగు జిల్లా నేతల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో రాజాం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు అందుకు బలం చేకూర్చుతున్నాయి.
 
  ఇటీవల రాజాంలోని శ్రీవేదగాయత్రి జూనియర్ కళాశాలను జీఎన్‌ఆర్ జూనియర్ కళాశాలకు సమీపంలోకి తరలించారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ జీఎన్‌ఆర్ కళాశాల యాజమాన్యం అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో యాజమాన్య ప్రతినిధులు సంతకవిటి మండల నాయకుడు కొల్ల అప్పలనాయుడు ద్వారా మంత్రి అచ్చెన్నాయుడును కలిశారు. మంత్రి ఆదేశాలతో ఆర్‌ఐవో వి.పాపారావు గత ఆదివారం శ్రీవేద గాయత్రి కళాశాలను సీజ్ చేశారు. దీంతో ఈ కళాశాల ప్రతినిధులు కళావెంకట రావును ఆశ్రయించారు. ఆయన సూచనలతో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. ఆయన ఆదేశాలతో 24 గంటలు తిరగకముందే కళాశాలను తిరిగి తెరిచారు.
 
  రాజాం నగరపంచాయతీ కమిషనర్ పి.సింహాచలం ఎమ్మెల్సీ ప్రతిభాభారతికి అనునూయుడి ముద్రపడిపోయింది. ఏ పని జరగాలన్నా, చివరికి కుళాయి కనెక్షన్ కావాలన్నా ఎమ్మెల్సీకి తెలియకుండా జరగవనే ప్రచారం కూడా జరిగింది. కమిషనర్ తీరు బాగాలేదంటూ ఇటీవల రాజాం, సంతకవిటి మండలాలకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా భావించిన మంత్రి... తక్షణమే రాజాం కమిషనర్‌ను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేగాకుండా ఎంతటి స్థాయి నాయకుడు అడ్డుపడినా బదిలీని ఆపొద్దని మరీ ఆదేశాలిచ్చారట. కానీ కళావెంకటరావు, ప్రతిభాభారతి పట్టుబట్టి మరీ కమిషనర్ బదిలీని నిలుపుదల చేయించేశారు.
 
  రాజాం ఏఎంసీ చైర్మన్ పదవి విషయంలోనూ మంత్రి అచ్చెన్నాయుడికి ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పదవికి వంగర మండలానికి చెందిన పైల వెంకటరమణ పేరును ఎమ్మెల్సీ ప్రతిభాభారతి సూచించారు. మంత్రి మాత్రం సంతకవిటి మండలంలో తన అనుచరుడైన కొల్ల అప్పలనాయుడు పేరును తెరపైకి తెచ్చారు. ఇది ఇరువర్గాల మధ్య పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ వెళ్లింది. చివరకు ప్రతిభాభారతి మాట కే సీఎం ప్రాధాన్యం ఇచ్చారనే గుసగుసలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి.
 
 ఈ సంఘటనలే గాకుండా రాజాం నియోజకవర్గంలోని అధికారులు కూడా మంత్రి సిఫారసు లేఖలకు విలువ ఇవ్వట్లేదనే ప్రచారం జరుగుతోంది.  రాజాంలోని గాయత్రీ కాలనీలో స్థల వివాదం ఒక్కటి మంత్రి అచ్చెన్నాయుడి వద్దకు ఇటీవల వెళ్లింది. తనను ఆశ్రయించిన వర్గానికి అనుగుణంగా వివాదం పరిష్కరించాలని సూచిస్తూ మంత్రి ఒక లేఖ ఇచ్చారట. తీరా దాన్ని తహసిల్దారు పక్కనబెట్టేయడంతో ఆ వర్గం ఖంగుతిన్నారని తెలిసింది. అవతల వర్గానికి ప్రతిభాభారతి అండదండలు ఉండటమే దీనికి కారణమని ప్రచారం జరిగింది.
 

మరిన్ని వార్తలు