జిల్లాకు సమ్మె షాక్

6 Oct, 2013 03:53 IST|Sakshi

నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్ : ఇక విద్యుత్ కష్టాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. రెండు రోజులుగా బంద్ జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో సీమాంధ్రలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. వీటీపీఎస్‌లో 1260 మెగావాట్లు, ఆర్టీపీపీలో 840 మెగావాట్లు, సీలేరు థర్మల్ కేంద్రంలో 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె పిలుపుతో ఆదివారానికి మిగిలిన కేంద్రాల్లో కూడా ఉత్పత్తి నిలిచిపోతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సమ్మె కారణంతా అత్యవసర సేవలకు కూడా హాజరుకాబోమని విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేశారు. దీంతో సీమాంధ్రులకు విద్యుత్ కష్టాలు తప్పని పరిస్థితి తలెత్తింది.
 
 జిల్లాలో 4000 మంది  సమ్మెలోకి..
 జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న దాదాపు 4000 మందికి పైగా ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొనున్నారు. జెన్‌కోలో 1100 మంది, ట్రాన్స్‌కో, డిస్కంలలో కలిపి 2000 మందితో పాటు దాదాపు 1000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయనున్నారు. సరఫరాలో సమస్యలు తలెత్తితే ఎలాంటి మరమ్మతులు చేపట్టరు. దీంతో నేడో రేపో జిల్లాలో సరఫరా పూర్తిగా నిలచిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అత్యవసర సేవలైన తాగునీరు, ఆస్పత్రులు తదితర వాటి మరమ్మతులకు కూడా సిబ్బంది హాజరుకారని చెబుతున్నారు. నిత్యావసరాల్లో విద్యుత్ ఒక భాగమైంది. ప్రతి పనికి విద్యుత్ సరఫరాపై ఆధారపడాల్సి వస్తుంది.  
 
 చీకట్లో పలుప్రాంతాలు
 శనివారం సాయంత్రం నుంచే జిల్లాలోని పలు ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని వంద గ్రామాలు, ఉదయగిరి ప్రాంతంలోని 50 గ్రామాలు, నవలాకులతోట, కోవూరు, సూళ్లూరుపేటలోని కొన్ని ప్రాంతాలతో పాటు నెల్లూరులోని వేదాయపాళెం, పొదలకూరు రోడ్డు, మూలాపేట, బారకాసు, తదితర ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
 

మరిన్ని వార్తలు