జిల్లాను వణికిస్తున్న జ్వరాలు

23 Sep, 2014 02:45 IST|Sakshi
జిల్లాను వణికిస్తున్న జ్వరాలు

కడప ఎడ్యుకేషన్:
 ఇటీవల కురిసిన వర్షానికి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో మలేరియాతోపాటు టైఫాయిడ్ జ్వరాలు అధికమయ్యాయి. దీంతోపాటు పలువురు చిన్నారులకు రక్తకణాలు తగ్గి డెంగీ లక్షణాలతో తిరుపతి, కర్నూలులో వైద్యసేవలు పొందుతున్నారు. ఖాజీపేట మండలంలోని చెముళ్లపల్లె బీసీ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారికి డెంగీ లక్షణాలు కనబడడంతో ఆదివారం తిరుపతి రుయాకు తరలించారు. అలాగే ఖాజీపేట బీసీకాలనీని చెందిన ఓ మహిళ మలేరియాతో రెండు రోజుల నుంచి కడపలోని ఓ ప్రయివేట్ అసుపత్రిలో చికిత్స పొందుతోంది. మైదుకూరు మండలం జాండ్లవరం, తువ్వపల్లె గ్రామాల్లో చాలా మందికి మలేరియా జ్వరాలు సోకినట్లు తెలిసింది. అలాగే శాంతినరగం గ్రామానికి చెందిన దినేష్‌కుమార్ ఈనెల 9 వతేదీన జ్వరంతో మృతి చెందినట్లు తెలిసింది. ఈ నెల 19 వతేదీన రాజుపాలెం మండలం అర్కటవేముల గ్రామానికి చెందిన అనిత మెదడువాపుతో చనిపోయింది. ముద్దనూరుకు చెందిన లక్ష్మీసాగర్‌జ్వరంతో చనిపోయినట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇంకా కొందరు జ్వరాలతో  చనిపోయినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా  ఆరోగ్యశాఖ తమకేమీ పట్టనట్లు నిద్రమత్తులో జోగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాలకెళ్లి బ్లీచింగ్ చల్లడం తప్ప మరేం చేయటం లేదన్న అరోపణలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ స్పందించి పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవటంతోపాటు దోమల బెడదను అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కడప పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇళ్ల మధ్యలో మురుగునీరు నిలవటమే కాకుండా పేడదిబ్బలతో దుర్గందం వెదజల్లుతోంది. దీంతో దోమలకు అవాసాలుగా మారాయి. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
 

 

మరిన్ని వార్తలు