జిల్లా ఓటర్లు 28,85,799

25 Jan, 2014 01:50 IST|Sakshi

అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  పౌరుడిగా ఒక గుర్తింపును సూచిస్తుంది ఓటరు కార్డు. తన కంటూ ఒక హక్కును కల్పించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో ఓటు కీలకం కానున్నది. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులందరినీ ఓటరుగా నమోదు చే యడమే భారత ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.
 
 ఇందు కోసం ప్రతి ఏడాదీ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ద్వారా కొత్తగా ఓటరు నమోదును చేపడుతోంది. జిల్లాలో 42,30,314 మంది జనాభా ఉన్నారు. వీరిలో 21,39,265 మంది పురుషులు, 20,91,049 మంది స్త్రీలు ఉన్నారు. శుక్రవారం జిల్లాల వారీగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో అనంతపురం జిల్లాలో 28,85,799 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 2013, జనవరి 1 నాటికి 26,57,295 మంది ఓటర్లు జిల్లాలో ఉండేవారు.
 
 గత ఏడాది ఏప్రిల్, ఆగస్టు, నవంబర్, డిశంబర్‌లలో విడతల వారీగా ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ చేపట్టారు. శుక్రవారం నాటికి కొత్తగా 3,48,855 మందిని ఓటర్లుగా చేర్చగా, డబుల్ ఎంట్రీలు, చనిపోయిన ఇతరత్రా వాటి కింద 1,20,351 మందిని తొలగించారు. తుది ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల చే యనున్నారు. శనివారం నాల్గవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఓటర్లతో ప్రతిజ్ఞ చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి.

మరిన్ని వార్తలు