దర్జాగా.. అక్రమాలు

31 Jan, 2015 03:38 IST|Sakshi
దర్జాగా.. అక్రమాలు

జిల్లా వ్యాప్తంగా ఎడాపెడా కొత్త నిర్మాణాలు!?
ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్‌పై అక్రమార్కుల ఆశలు
తెరచాటుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు

 
కర్నూలు :  జిల్లా వ్యాప్తంగా ఎడాపెడా కొత్త నిర్మాణాలు, లేఅవుట్లు తెరపైకి వస్తున్నాయి. అక్రమ లేఅవుట్ల, నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరోసారి లేఅవుట్ క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్), బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్)ను తీసుకొచ్చేందుకు సన్నద్ధం కావడంతో గుంపులో గోవింద అంటూ తెరచాటు అక్రమ నిర్మాణాలకు అక్రమార్కులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అధికారికంగా ఈ పథకాలను ప్రకటించేలోగా ఈ అక్రమ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆయా వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ముందస్తు అనుమతుల్లేకుండా కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాలన్నా, లేఅవుట్లు వేయాలన్నా స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరి. లేదంటే వీటిని అక్రమ నిర్మాణాలుగా పరిగణిస్తారు. వీటిని ఎవరైనా కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్లు జరగవు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేది తక్కువ. గతంలో కొందరు వ్యాపారులు చేసిన మోసాలకు కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవ్వడాన్ని గుర్తించిన ప్రభుత్వం 2007లో మొదటిసారి బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ని ప్రవేశపెట్టింది. బీపీఎస్ కింద అప్పట్లో దాదాపు 8 వేలకుపైగా  దరఖాస్తులొచ్చాయి.

4,600కుపైగా పరిష్కరించారు. 2013 మార్చి వరకు క్రమబద్ధీకరణ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ కింద వచ్చిన వెయ్యి దరఖాస్తుల్లో అప్పట్లో 50 శాతానికిపైగా పరిష్కారమయ్యాయి. పట్టణ ప్రణాళిక సూచించిన మేరకు తదుపరి సమాచారాన్ని అందించకపోవడంతో దాదాపు 500 దరఖాస్తులు వివిధ దశల్లో అపరిష్కృతంగా మిగిలాయి. మరోసారి బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ వచ్చే అవకాశం లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పదేపదే ప్రకటించడంతో నగరం, గ్రామీణ జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు వేసేందుకు వ్యాపారులు సాహసించలేదు. కొనుగోలుదారుల్లోనూ చైతన్యం రావడంతో లేఅవుట్లకు డీటీసీపీ, అపార్ట్‌మెంట్లకు కర్నూలు కార్పొరేషన్/మున్సిపాలిటీ అనుమతి ఉందా? లేదా? అనేది నిర్ధారించుకున్నాకే రంగంలోకి దిగుతున్నారు. దీంతో రియల్టీ వ్యాపారులు కూడా అచితూచి వ్యవహరిస్తున్నారు.

క్రమబద్ధీకరణ లక్ష్యంగా నిర్మాణాలు..

 స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం మరోసారి బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో ఇదే మంచి తరుణంగా భావించి కొత్తగా అనేక నిర్మాణాలకు, లేఅవుట్లకు వ్యాపార వర్గాలు తెరతీస్తున్నాయి. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో గత నెల రోజుల వ్యవధిలో 50 నుంచి 100 వరకు అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అధికారికవర్గాలు గుర్తించాయి. వీటిలో 70 శాతానికిపైగా ఉన్న పాత భవంతులపై అదనపు అంతస్తులు వేసినవే. ప్రణాళిక విభాగ క్షేత్రస్థాయి ఉద్యోగుల సాయంతో మూడో కంటికి తెలియకుండా నిర్మాణాలను పూర్తి చేశారు. వీటిని బీపీఎస్ కింద క్రమబద్ధీకరించుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం.  ఇప్పటికీ నగర పరిధిలోనూ, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో ప్రణాళిక విభాగ అధికారులతో అదనపు అంతస్తుల నిర్మాణం కోసం వ్యాపారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా కొత్తగా 50 వరకు లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. కర్నూలు నగర పరిధిలోని శివార్లలోనూ, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ పట్టణ శివార్లలో వీటిని వేసినట్లు నిఘా, అమలు విభాగం తాజాగా గుర్తించినట్లు సమాచారం. వీటిని ప్లాట్ల కింద సాధ్యమైనంత వేగంగా విక్రయించి సొమ్ము చేసుకోవాలన్నది వ్యాపారుల ఉద్దేశం. నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలంటే వివిధ రుసుముల కింద భారీగా చెల్లించాలి. ప్రభుత్వ భూమి వంటివి ఇందులో కలిసి ఉంటే అధికారులు కొర్రీలు వేస్తారు. ప్రభుత్వం మరోసారి తీసుకొచ్చే ఎల్‌ఆర్‌ఎస్‌తో ఇలాంటి అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలన్నది వ్యాపారుల లక్ష్యం.
            
 నియంత్రించాల్సింది అధికారులే...

అక్రమ భవనాల, లేఅవుట్ల నియంత్రణ అధికారుల చేతిలోనే ఉంది. త్వరలో బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకాలు మళ్లీ ప్రవేశపెడతారనే ఉద్దేశంతో నిర్మాణాలు సాగిస్తున్న, తెరచాటు అక్రమ నిర్మాణాలను అధికారులే నిరోధించాలి. క్షేత్రస్థాయిలో జరిగే వ్యవహారాలపై దృష్టి సారిస్తే వీటిని అడ్డుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. లేనప్పుడు బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ లాంటి పథకాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా నిర్మాణాలు చేపట్టి క్రమబద్ధీకరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కర్నూలు కార్పొరేషన్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వీటిపై దృష్టిసారిస్తే మేలు.
 

>
మరిన్ని వార్తలు