విడిపోయిన లోకల్‌రైలు బోగీలు

19 Feb, 2014 02:11 IST|Sakshi


 
 మోటర్‌మెన్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
 
 ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి కల్యాణ్ బయలుదేరిన లోకల్ రైలు మధ్య కప్లింగ్ ఊడి బోగీలు విడిపోయాయి. అయితే మోటార్‌మెన్ (డ్రైవర్) అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ సంఘటన సోమవారం సాయంత్రం దీవా-కోపర్ స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. దీనివల్ల దాదాపు గంటకుపైగా లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
  సాయంత్రం విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేకమంది రైలు దిగి కాలినడకన వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో దీవా స్టేషన్ నుంచి లోకల్ రైలు కల్యాణ్ దిశగా బయలుదేరింది. కొంత దూరం వెళ్లగానే ఏడో బోగీ, ఎనిమిదో బోగీ మధ్యనున్న కప్లింగ్ ఊడింది. అప్పటికీ రైలు వేగం పుంజుకోలేదు. ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లిపోయింది. వెనకా ఉన్న ఐదు బోగీలు కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. చీకటి కారణంగా రైలులో ఉన్న ప్రయాణికులకు అసలేం జరిగిందో తెలియలేదు. బయటకు తొంగి చూడగా కప్లింగ్ ఊడిపోవడంతో ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లినట్లు గుర్తించారు. ఐదు బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు కిందికి దిగేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మోటార్‌మెన్ వెంటనే రైలును ఆపాడు. తర్వాత విడిపోయిన ఐదు బోగీలను కారుషెడ్డుకు తరలించారు. అప్పటికే వెనకాల వచ్చిన రైళ్లన్నీ ట్రాక్‌పై నిలిచిపోయాయి. కొన్ని లోకల్ రైళ్లను వీలున్న చోట దారి మళ్లించి ఫాస్ట్ ట్రాక్ మీదుగా నడిపారు. రైళ్లను పునరుద్ధరించడానికి అధికారులు కష్టపడ్డారు. రాత్రి 10 గంటల తర్వాత రైళ్లన్నీ షెడ్యూల్ ప్రకారం నడిచాయి.

మరిన్ని వార్తలు