మ్యాచ్ ఇంకా ముగిసిపోలేదు

14 Feb, 2014 02:05 IST|Sakshi

* తెలంగాణ బిల్లుపై సీఎం కిరణ్ వ్యాఖ్యలు
* ఆఖరి బంతి వేసే వరకు ఆట ముగియనట్లే!
* సోనియా గాంధీ మా లీడర్..
* నా రాజీనామాకు సమయం ఉంది
 
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును లోక్‌సభలో పెడితే రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. గురువారం మాత్రం తన రాజీనామాకు ఇంకా సమయం ఆసన్నం కాలేదని అన్నారు. కేంద్రం లోక్‌సభలో బిల్లు పెట్టినప్పటికీ.. అది ప్రవేశపెట్టారా లేదా అన్న దానిపై ఇంకా సందేహాలున్నాయని, అది తేలే వరకు చూద్దామని కొంతసేపు.. బిల్లును ప్రవేశపెట్టడంతోనే అంతా అయిపోలేదని, సభ చివరి రోజైన 21 వరకు వేచిచూద్దామని మరికొంతసేపు చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తన రాజీనామా ఒక ఆప్షన్ మాత్రమేనంటూ మాట మార్చారు. బిల్లు పెట్టినంత మాత్రాన మ్యాచ్ ముగిసినట్లు కాదన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికే తాను వ్యతిరేకం తప్ప పార్టీకి కానేకాదని, సోనియా గాంధీనే తమ నాయకురాలని తేల్చి చెప్పారు. గురువారం అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన తన చాంబర్లో మీడియాతో ఇష్టాగోష్టిగా, పలు సందర్భాల్లో నవ్వుతూ మాట్లాడారు. మీడియాతో కిరణ్ సంభాషణ సాగిందిలా..
 
 ప్రశ్న: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు. రాజీనామా చేస్తున్నారా?
 సీఎం: అది ఇంకా ప్రవేశపెట్టలేదని సుష్మా చెబుతున్నారు. బిల్లు ప్రవేశపెట్టారో లేదో తేలనీయండి.
 ప్ర: లోక్‌సభలో ఘటనల గురించి ఏమంటారు?
 సీఎం: దురదృష్టకరం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థపైనే అపనమ్మకం కలిగిస్తాయి. బిల్లు ప్రవేశపెట్టడం ఒక పద్ధతి ప్రకారం చేయాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. సంప్రదాయాలను పాటించడం లేదు.
 ప్ర: కేంద్రం తప్పు చేసిందని భావిస్తున్నారా?
 సీఎం: అవును. రాష్ట్ర విభజనపై మొదటి  నుంచీ పొరపాట్లు జరుగుతున్నాయి. తె లంగాణ నిర్ణయం తప్పు. జీవోఎం కూర్పు తప్పు. బిల్లును చదువుకోవడానికి మంత్రులకు సైతం సమయం ఇవ్వలేదు. అందువల్లే ఇలాంటి దుస్థితి ఎదురైంది. మంత్రులు వెల్‌లోకి వచ్చారంటే కేంద్రం ఆలోచించుకోవాలి. మంత్రులు రావడంపై ప్రధాని చాలా బాధపడ్డారట. మనసు గాయపడిందట. కోట్లాది తెలుగు ప్రజల మనసు గాయపడడం ఆయన గమనించరా? ఇంత తీవ్రస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారంటే ప్రధాని అర్థం చేసుకోరా? వారు వెల్‌లోకి నాలుగడుగులు వెళ్తేనే బాధపడుతుంటే కోట్లాది తెలుగుప్రజలు శాశ్వతంగా బాధపడే పరిస్థితి ఉంది. ఆయన దాన్ని ఆలోచించాలి. బలవంతపు నిర్ణయాలను అంగీకరించం.
 
 ప్ర: అసెంబ్లీలో తిరస్కరణ తీర్మానం బలవంతం కాదా?
 సీఎం: అసెంబ్లీలో 20 రోజులు చర్చ జరిగింది. సభ్యులు రాతపూర్వకంగా అభిప్రాయాలు చెప్పారు. మెజార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకించినందునే స్పీకర్ మూజువాణి ఓటుతో తిరస్కరణ తీర్మానం చేశారు. ఎక్కడైనా మెజార్టీ ఉందో లేదో చూసుకొని మూజువాణి ఓటును చేపట్టాలి.
 ప్ర: మీ తదుపరి కార్యాచరణ?
 సీఎం: నేను ఇంటికి వెళ్లడమే (అసెంబ్లీ ముగిసింది కనుక) ఇలా అంటే నా ప్రకటనను వక్రీకరిస్తున్నారు. నిన్న ఆఖరు కదా? అని అంటే ఏదేదో రాశారు. అసెంబ్లీ ఆఖరు అని చెప్పానే తప్ప రాజీనామా చేస్తానన్లేదు.
 ప్ర: బిల్లు పెట్టినందున ఇప్పుడు రాజీనామా చేస్తారా?
 సీఎం: రాజీనామా అన్నది ఒక ఆప్షన్. ఏదైనా అందరితో చర్చించాకే నిర్ణయం. దానికి ఇంకా సమయం ఉంది. బిల్లు పెట్టారో లేదో తేలనీయండి. ఆ తర్వాత చూద్దాం.
 ప్ర: లగడపాటి పెప్పర్ స్ప్రే ప్రయోగించడాన్ని ఏమంటారు?
 సీఎం: అవతలి వారు దాడి చేయడం వల్ల ఆత్మరక్షణ కోసం దాన్ని వినియోగించారేమో. ఆత్మరక్షణ కోసం చేశారా? లేదా అన్నది సభలో తేల్చాలి. దాడిచేయడం కూడా సరికాదు కదా?
 ప్ర:  పార్లమెంటులో బిల్లు పెడితే రాజీనామా చేస్తామన్నారు?
 సీఎం: బిల్లు యథాతథంగా పెడితే రాజీనామా అన్నాను. ఆ బిల్లు, ఈ బిల్లు ఒక్కటే అయితే అప్పుడు ఆలోచిద్దాం.
 ప్ర: ఆర్నెళ్ల క్రితం రాజీనామా చేస్తే ఫలితముండేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స అంటున్నారు?
 సీఎం: ఎవరి అభిప్రాయం వారిది.ఆయన (బొత్స) రాజీనామా చేయాలనుకుంటే చేసేయవచ్చు.
 ప్ర: రాష్ట్ర సమైక్యంపై ఇంకా ఆశ ఉందా?
 సీఎం: ఇప్పుడు విడిపోలేదు కదా? బిల్లు ప్రవేశపెట్టారో లేదో ముందు తేలాలి. బిల్లు పెట్టడంతోనే అంతా అయిపోయినట్లు కాదు. అదింకా పాసవ్వాలి.
 ప్ర: బిల్లు పాసయ్యాక చేస్తారా?
 సీఎం: ఎప్పుడు ఏం చేయాలో మీరు (పత్రికలు) రాసిన దాన్ని అనుసరించి చేస్తాను లెండి.
 ప్ర: కాంగ్రెస్‌కు సున్నా ఫలితాలు వస్తాయన్నారు కదా?
 సీఎం: విభజన జరిగితే ఎన్నికల్లో సున్నా ఫలితాలు వస్తాయని ఇంతకుముందే చెప్పాను. విభజన జరగాలి కదా?
 ప్ర: ఈ స్థాయికి వచ్చాక  కూడా రాష్ట్ర విభజన జరగదా?
 సీఎం: ఈ నెల 21 వరకు వేచి చూస్తే తేలుతుంది.
 ప్ర: చంద్రబాబే ఢిల్లీలో ఉండి ఇలా (లోక్‌సభలోని ఘటనలు) చేయించారంటున్నారు?
 సీఎం: గుర్తింపులేని వారి గురించి ఇక్కడ చర్చ వద్దు. సభలో అభిప్రాయం కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్న వారి గురించి ఇక్కడ మాట్లాడ్డం అనవసరం.
 ప్ర: ఎన్నికలయ్యే వరకు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందా?
 సీఎం: ఈనెల 21వరకు చూద్దాం. ఇంకా మ్యాచ్ పూర్తికాలేదు. గేమ్ ఇంకా ఉంది. చివరి బాల్ వరకు ఆట ముగియనట్లే. బిల్లు ప్రవేశపెట్టగానే అయిపోయిందా? లోక్‌సభలో చర్చ జరగాలి. విభజన వల్ల లాభనష్టాల గురించి దేశానికి తెలియాలి. విభజనపై కేంద్రానికి ఒక విధానమంటూ ఉందా? రాష్ట్ర విభజన జరగాలో లేదో ప్రజలకు వదిలేయాలి. రెండునెలల్లో ఎన్నికలు జరగనున్నందున ఆ ఎన్నికల్లో వారే తేలుస్తారు. ఎన్నికలు తెలంగాణ, సమైక్యంపై రెఫరెండమ్‌గానే జరుగుతాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని నేతలు తప్ప తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదు.
 ప్ర: రాష్ట్రంకోసం ఆత్మబలిదానాలు చేసుకున్నది ప్రజలే కానీ నాయకులు కాదు కదా?
 సీఎం: ఇది సున్నితమైన అంశం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యవసాయం వద్దని అంటామా? ఆత్మహత్యలతో రాష్ట్రాలు ఏర్పడవు.
 ప్ర: తెలంగాణకు బీజేపీ మద్దతు ఇస్తోంది కదా?
 సీఎం: బీజేపీ మతతత్వ పార్టీ అని మా పార్టీ నేతలే అంటారు. మళ్లీ అదే పార్టీ నేతలకు విందులు ఇచ్చి చర్చిస్తారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అందరినీ ఒప్పించి చేశారు. ఇక్కడ అందుకు భిన్నంగా ఎందుకు వెళ్తారు. ఇంత లోపభూయిష్ట బిల్లును చూడలేదని, తీర్మానం లేదని అద్వానీయే అన్నారు. మరి ఆ పార్టీ నేతలు లోక్‌సభలో ఆయన మాటల్ని గౌరవిస్తారో లేదో చూద్దాం.
 ప్ర: ఈ నిర్ణయం మీ పార్టీయే చేసింది అందులో ఎందుకు కొనసాగుతున్నారు?
 సీఎం: కొనసాగుతానో లేదో చూద్దాం. బిల్లుపై ఏ నిర్ణయం వస్తుందో మరి!
 ప్ర: ఎంపీలను సస్పెండ్ చేశారు. ఏం జరగబోతుంది?
 సీఎం: ఇది అప్రజాస్వామిక చర్య. ఇలా బిల్లును ప్రవేశపెట్టడం అప్రజాస్వామికం.
 ప్ర: బీజేపీవైపు వెళ్తారా?
 సీఎం: నేనెప్పుడూ బీజేపీని మతతత్వ పార్టీ అనలేదు. అలా అని ఆ పార్టీలో చేరుతానని ఎలా అంటారు? నాతో మోడీకానీ, రాజనాథ్ సింగ్ కానీ మాట్లాడలేదు.
 ప్ర: సోనియాగాంధీని ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఇదంతా డ్రామానేనా?
 సీఎం: సోనియాగాంధీ మా లీడర్. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను తప్ప ఆమెను వ్యతిరేకించడం లేదు.
 
 ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల ఆమోదం
 సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లు-2014కు శాసనసభ, మండలి మూజువాణి ఓటుతో ఆమోదించాయి. ఆర్థిక మంత్రి బిల్లును ప్రతిపాదించగా సభ ఆమోదించింది. శాసనసభ ఉదయం మొదలుకాగానే ‘సీమాంధ్ర సభ మాకొద్దు’ అని టీఆర్‌ఎస్ నేతలు నినదించారు. కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ నేతలు  దీనికి గొంతు కలిపారు. దీంతో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మనోహర్ ప్రకటించారు. 12.50 గంటలకు సభ తిరిగి ప్రారంభంకాగా, టీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు నినాదాలు చేశారు. ఏపీ అసెంబ్లీకి బై బై.. తెలంగాణ అసెంబ్లీకి స్వాగతం అని రాసిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన అనంతరం సహకరించిన సభ్యులందరికీ స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అటు శాసనమండలిలోనూ బిల్లుకు మూజువాణితో ఆమోదముద్ర వేశారు. మండలి ప్రారంభమైన వెంటనే రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తూ పంపిన తీర్మానంలో ఏకగ్రీవం అనే పదాన్ని తొలగించాలని తెలంగాణ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.   
 
 సీమాంధ్ర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ భేటీ
 సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో గురువారం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టటం, ఆ సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహచర సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయన గురువారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, టి.జి.వెంకటేష్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జె.సి.దివాకర్‌రెడ్డి, చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు తదితరులతో భేటీ అయ్యారు.
 
 ఇప్పటికే విభజన బిల్లును సభలో పెట్టినందున ఈ నెల 21 వరకు రాజీనామాలపై నిర్ణయం తీసుకోకుండా వేచిచూద్దామని కొందరు మంత్రులు అభిప్రాయపడగా.. ఇప్పుడే చేసేద్దామని, అప్పటిదాకా వేచి ఉండడం అనవసరమని వాదించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలను కూడా సంప్రదించాక తుదినిర్ణయానికి వద్దామని సీఎం వారితో అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 16వతేదీ ఉదయం కేంద్ర మంత్రులు, ఎంపీలతోను, సాయంత్రం రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలతోను భేటీకావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిసింది.

మరిన్ని వార్తలు