పోలీసు విభజన షురూ!

10 Mar, 2014 02:52 IST|Sakshi
పోలీసు విభజన షురూ!

విభాగాల వారీగా స్థానికత నమోదు
రాష్ట్రం వెలుపలనున్న ఆస్తుల వివరాల సేకరణ
ప్రస్తుత భవనంలోనే రెండు రాష్ట్రాల డీజీపీలు!

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో విభజన ప్రక్రియ మొదలైంది. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది, ఆస్తుల వివరాల సేకరణపై దృష్టి సారించారు. సిబ్బంది స్థానికతను తెలుసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం, సీఐడీ, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్‌ఐబీ తదితర విభాగాలలో పని చేస్తున్న పోలీసు ఎగ్జిక్యూటివ్, మినిస్టీరియల్ సిబ్బంది స్థానికతతో పాటు ఇతర వివరాలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. మరోవైపు పోలీసు శాఖకు రాష్ట్రం వెలుపల ఉన్న ఆస్తుల వివరాలను సేకరించే పనిలో ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు.
 
 - పుట్టిన స్థలం, విద్యాభ్యాసం తదితర వివరాలతో కూడిన పత్రాలను సిబ్బంది నుంచి తీసుకుంటున్నారు. ఈ వివరాలను క్రోడీకరించి రికార్డులు సిద్ధం చేస్తున్నారు.
 - ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు (ఏపీఎస్పీ)కు రాష్ట్రంలో 17 బెటాలియన్లు ఉండగా.. అందులో 10 తెలంగాణ జిల్లాల్లో, 7 సీమాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రస్థాయి రిక్రూట్‌మెంట్ కావడంతో.. తెలంగాణ జిల్లాల్లో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిలో ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారు. పూర్తి వివరాలు సేకరించాక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు సిబ్బంది పంపిణీ ప్రారంభించాలని డీజీపీ కార్యాలయం అధికారులు నిర్ణయించారు.
 - ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖకు ఉన్న భవనాలు, స్థలాలు, ఇతర ఆస్తుల జాబితాను రూపొందించిన అధికారులు.. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం వెలుపల ఉన్న వాటి వివరాల సేకరణపై దృష్టి పెట్టారు. ఈ వివరాల కోసం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ (ఏపీపీహెచ్‌సీ)కి లేఖ రాశారు. నగర పోలీసు, ఇతర కీలక విభాగాలకూ వర్తమానం పంపారు. వీలైనంత త్వరగా పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు.
 - విజయవాడ సమీపంలో ఆక్టోపస్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తిరుపతిలో మాత్రమే ఈ హబ్స్ ఉన్నాయి.
 - రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండబోతోంది. దీంతో ప్రస్తుత డీజీపీ కార్యాలయ భవనంలోనే.. మరో డీజీపీకి కొంత స్థలాన్ని కేటాయించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్త భవనం సమకూరే వరకూ సీఐడీ, ఇంటెలిజెన్స్ కార్యాలయాలూ.. డీజీపీ కార్యాలయ భవనంలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు