మూడు'ముళ్ల' బంధం

22 Sep, 2018 07:18 IST|Sakshi

తెగిపోతున్న బంధాలు

రోజు రోజుకూ పెరుగుతున్న విడాకుల కేసులు

పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతి

అల్లిపురం(విశాఖదక్షిణం):  కలకాలం కలసి జీవించాల్సిన భార్యాభర్తలుచిన్న చిన్న తగాదాలకే కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. పవిత్రమైన మూడుముళ్లబంధాన్ని తెంచుకునేందుకు విడాకులు కోరుతున్నారు. దీంతో కుటుంబవ్యవస్థ ఛిన్నాభిన్నమవుతోంది. పెళ్లి అయిన ఏడాది లోపు విడాకులుతీసుకోరాదని హిందూ వివాహ చట్టం చెబుతోంది.

నేడు పాశ్చాత్య సంస్కృతి పెరుగుతోంది. యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడు తుండడంతో వివాహ బంధంపై అవగాహన లేక విడిపోయి నష్టపోతున్నారు. నేడు ఇద్దరు చదువులు, ఉద్యోగాలు సమానంగా ఉండడంతో ఇద్దరి మధ్య అహంభావం పెరిగి విడిపోవడానికి కారణాలు అవుతున్నాయి. అలాగే సోషియల్‌ మీడియా కూడా విడాకులకు మరో కారణమవుతోంది. ప్రేమ వివాహాల్లో  కుటుంబ నేపథ్యాలు వేరుగా వుండడం, తల్లిదండ్రులు పిల్లలపై పట్టుకోల్పోవడం, నేడు కుటుంబాలు చిన్నవి కావడం కూడా ఆ బంధంపై అవగాహనా రాహిత్యానికి కారణం. భార్యాభర్తలు ఇద్దరు విదేశాల్లో వుండి వారి తల్లిదండ్రులు స్థానిక కోర్టులకు జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ద్వారా హాజరై విడాకుల కేసులను నడుపుకోవడం జరుగుతోంది. వివాహ బంధాన్ని అర్థం చేసుకునే పరిస్థితి నేడు యువతలో కనబడడం లేదు.

ఇద్దరి సమ్మతితో విడాకులు
హిందూ వివాహాన్ని విడాకుల ద్వారా రద్దు చేసుకోవాలంటే 1976కు ముందు చాలా కారణాలు చూపిస్తే కానీ మంజూరయ్యేవి కావు. ఆ సమయంలో భార్యాభర్తలు ఇష్టపడి విడాకులు తీసుకోవాలన్నా ఇచ్చేవారు కాదు. 1976లో ఒక సవరణ ద్వారా హిందూ వివాహ చట్టం సెక్షన్‌ 13బిని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒక కారణం చూపి తాము ఒక ఏడాది ముందు నుంచి కలిసి వుండడం లేదని, ఇక ముందు వుండలేమని విడాకులు తీసుకునేందుకు ఇద్దరు కలసి న్యాయస్థానంలో ఉమ్మడిగా దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చు. అప్పటి నుంచి విడాకుల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆ కేసులు పెరిగిపోతున్నాయి.

సంతకాలు చేస్తే విడాకులు కావు
పెద్ద మనుషులు పంచాయతీలు చేసి ఓ స్టాంప్‌ పేపర్‌పై విడాకుల పత్రం రాసుకుంటే చెల్లదు. న్యాయస్థానం మంజూరు చేసిన ఉత్తర్వులు ద్వారానే విడాకులు చెల్లుతాయి. భార్యాభర్తలు ఎవరికి వారు విడిపోయి వేరొకరిని వివాహాలు చేసుకుంటే అవి చట్టప్రకారం చెల్లవు. కోర్టులో విడాకులు పిటిషన్‌ దాఖలు చేసుకుని కోర్టు ద్వారా విడాకులు పొందిన తర్వాతే వేరొకరిని వివాహం చేసుకోవాలి. అప్పుడే రెండో వివాహం చెల్లుతుంది.

పిటిషన్‌ కోర్టులో ఎప్పుడు దాఖలు చేయాలి
భార్యాభర్తలిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహమైన ఏడాదిలోపు విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్‌దాఖలు చేయకూడదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మా త్రం ప్రత్యేక అనుమతి ద్వారా ఏడాదిలోపే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చు. హిందూ వివాహచట్టం సెక్షన్‌ 14 ఈ అంశాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ కారణంతోనైనా భార్యాభర్తల వివాహం చెల్లకపోయినా లేదా చెల్లకుండా కోర్టు రద్దు చేసినా వారి వివాహం వల్ల పుట్టిన సంతానం అక్రమ సంతానం కాదు. ఆ సంతా నానికి అన్ని హక్కులు వుంటాయి. వివాహం జరిగిన చోటు, ఇద్దరు కలసి చివరి సారి ఎక్కడ కాపురం వున్నారో, భార్యాభర్త ఉన్న చోట అక్కడ ఉన్న ఫ్యామిలీ కోర్టులేదా సీనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చు.

వైరుధ్య భావాలున్నా కూడా..
హిందూ వివాహాన్ని నిలబెట్టడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడమే గాక వైరుధ్య భావాలు వున్న దంపతులతో కూడా కలిపి కాపురం చేయించేందుకు కోర్టులు ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ కొన్ని వివాహాలు విఫలమవుతుంటాయి. ఇందుకు చట్టం కొన్ని కారణాలను పేర్కొని ఆ కారణాలు రుజువైన సందర్భాల్లో మాత్రమే విడాకులను కోర్టు మంజూరు చేస్తుంది.

జిల్లాలో సుమారురెండు వేల కేసులు
జిల్లాలో విడాకులు కోరుతూ ఏడాదికి రెండు వేల కేసులు నమోదవుతున్నాయి. వివిధ కారణాలు చూపుతూ కలిసి ఉండలేకపోతున్నామని కోర్టులకెక్కుతున్నారు. ఇలా వస్తున్న వారికి విశాఖలో ఫ్యామిలీ కోర్టు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది. ఇద్దరూ కచ్చితంగా కలిసి ఉండలేరని భావిస్తే విడాకులు మంజూరుకు అనుమతి ఇస్తోంది.

ఆరునెలలు ఆగాల్సిందే..
ఉమ్మడిగా భార్యాభర్తలిద్దరూ కోర్టులో దాఖలు చేసిన తర్వాత దాదాపు ఆరునెలల పాటు ఆగాల్సి వుంటుంది. ఎందుకంటే ఈ సమయంలోను కోర్టు భార్యా భర్తలిద్దరినీ కలిపేందుకు  ప్రయత్నిస్తుంది. న్యాయమూర్తి ఇద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అలాగే కేసును మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపి భార్యాభర్తలను ఇక చోట కూర్చోబెట్టి రాజీ చేయడానికి సభ్యులు ప్రయత్నిస్తారు. విడిపోయేందుకు ఏవైనా బలమైన కారణాలు ఉన్నాయనే విషయాలు కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. భార్యాభర్తలిద్దరూ తమకు విడాకులే కావాలని కోర్టును కోరవచ్చు. అప్పుడు వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే భార్యాభర్తల వాదనలు కోర్టు వింటుంది. తరువాత విచారణ చేసి ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌లోని విషయాలు నిజమని కోర్టు నమ్మితే విడాకులు మంజూరు చేస్తుంది.

పాశ్చాత్య ధోరణి పెరిగిపోతోంది
నేటి తరం యువతీ యువకుల్లో పాశ్చాత్య ధోరణి పెరిగిపోతోంది. వివాహ బంధంపై అవగాహన లేక విడిపోతున్నారు. చిన్న మాట పడేందుకు ఇష్టపడటంలేదు. మగవారు కూడా అదే పట్టుదలతో ఉండటం వల్ల కోర్టుల్లో ఫ్యామిలీ కేసులు పెరిగిపోతున్నాయి.  స్టేషన్లలో 498ఎ కేసులతో పాటు ఫ్యామిలీ కోర్టుల్లో పలు రకాల కేసులు నమోదవుతున్నాయి. సాధారణ కోర్టుల్లో కన్నా ఫ్యామిలీ కోర్టుల్లో కేసులు అధికమవుతున్నాయి.–పాలవలస రాంబాబు, సీనియర్‌ న్యాయవాది

మరిన్ని వార్తలు