నకిలీలు 'జేసి'!

8 Feb, 2020 10:01 IST|Sakshi

ఎస్‌ఐల సంతకాలు ఫోర్జరీ

గుట్టుచప్పుడు కాకుండా లారీల విక్రయం

బస్సులకూ నకిలీ పత్రాలు

బెంగళూరు, తెలంగాణలో వ్యవహారం

రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు

బయటకొస్తున్న జేసీ అక్రమాల చిట్టా

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అక్రమాలే పెట్టుబడిగా.. అధికారమే అరాచకంగా ఇన్ని రోజులుగా వ్యవహరిస్తున్న జేసీ బ్రదర్స్‌ పాపాలపుట్ట ఒక్కొక్కటిగా పగిలిపోతోంది. ఇప్పటికే పర్మిట్లు లేకుండా బస్సులను ఇష్టారాజ్యంగా తిప్పిన దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం.. ఏకంగా పోలీసు సంతకాలనే ఫోర్జరీ చేసి నిరంభ్యంతర సర్టిఫికెట్‌(ఎన్‌ఓసీ) పత్రాలు సృష్టించింది. వీటితో లారీలను విక్రయించిన ఘటన బయటపడి 24 గంటలు కూడా గడవకముందే మరో ఫోర్జరీ బాగోతం వెలుగులోకి వచ్చింది. తాజాగా తాడిపత్రి ఎస్‌ఐ సంతాకాన్ని ఫోర్జరీ చేసి.. రవాణా శాఖకు దరఖాస్తు చేసుకుని ఎన్‌ఓసీ తీసుకోవడం ద్వారా తెలంగాణలో రెండు బస్సులను విక్రయించారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన రవాణాశాఖ అధికారులు సదరు యాజమాన్యంపై అనంతపురం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 

కథ నడిపించారిలా..
దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన లారీలు, బస్సులకు సంబంధించిన రికార్డుల్లో అక్రమాలు భారీగా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో వీటి విక్రయానికి దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం అడ్డదారులు తొక్కినట్టు అర్థమవుతోంది. ఈ ట్రావెల్స్‌కు చెందిన ఆరు లారీలను బెంగళూరులో విక్రయించారు. ఇందుకోసం స్థానిక పోలీసుల నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, రికార్డులన్నీ నకిలీవి కావడంతో అడ్డదారుల్లో పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులను తయారుచేసి పోలీసుల నుంచి ఎన్‌ఓసీ తీసుకున్నారు. తద్వారా ఎన్‌ఓసీ ఉన్నట్టు చూపించి లారీలను బెంగళూరులో విక్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అయితే, లారీలతోపాటు రెండు బస్సులను(ఏపీ02టీసీ9666, టీఎస్‌09యుబీ7034) కూడా ఇదే విధంగా పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులతో రవాణా శాఖకు ఎన్‌ఓసీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. అనంతరం వీటిని తెలంగాణలో దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం విక్రయించింది. అయితే, తమకు దరఖాస్తు చేసింది ఫోర్జరీ డాక్యుమెంట్లు అని గుర్తించిన రవాణాశాఖ అధికారులు అనంతపురం 1వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మొత్తం దివాకర్‌ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాల రికార్డుల్లో అక్రమాలు జరిగాయని.. వీటిపై లోతైన విచారణ జరపాలంటూ ఉన్నతాధికారులకు కొందరు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు  సమాచారం. ఆ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారులు అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత లోతుగా..
ఇప్పటికే పర్మిట్లు లేని వ్యవహారంతో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీలో దివాకర్‌ ట్రావెల్స్‌ వ్యవహారం బయటపడింది. ఇక ఏకంగా అసలు రవాణాశాఖ నుంచి ఉన్న బస్సులకు కూడా పర్మిట్లు తీసుకున్న వ్యవహారంలో మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కూడా రవాణాశాఖ ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం ట్రావ్సెల్‌ బస్సులకు సమర్పించిన వివిధ డాక్యుమెంట్లన్నీ కూడా నకిలీవేనన్న ఫిర్యాదులు రవాణాశాఖ ఉన్నతాధికారులకు చేరాయి. దీంతో ప్రధాన కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు జిల్లాకు విచ్చేసి మొత్తం అక్రమ వ్యవహారాలను లాగే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమాల మొత్తం లోగుట్టును ఒకటి రెండు రోజుల్లో రవాణాశాఖ అధికారులు బయటపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే దివాకర్‌ ట్రావెల్స్‌పై సీరియస్‌ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ అక్రమ వ్యవహారాల్లో వెనుక నుంచి ఇన్నాళ్లుగా కథ నడిపించిన జేసీ బ్రదర్స్‌ దోషులుగా చట్టం ముందు నిలవాల్సిన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం వేధిస్తోందన్న వ్యాఖ్యలను జేసీ చేస్తున్నట్టు తాజా ఘటనలతో అర్థమవుతోంది. 

మరిన్ని వార్తలు