డీఎంహెచ్‌ఓ సరెండర్!

22 Dec, 2013 00:57 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (డీఎం హెచ్‌ఓ)పై అవినీతి ఆరోపణలు గుప్పుమనడంతో కలెక్టర్ బి.శ్రీధర్ విచారణకు ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపిన వైనంపై శనివారం ‘తనిఖీల లోగుట్టు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్.. డీఎంహెచ్‌ఓ సుధాకర్‌నాయుడును ప్రభుత్వానికి సరెండర్ చేయాలని నిర్ణయించారు.
 
  ఇప్పటికే ఆయన అవినీతిపై స్పష్టమైన ఆధారాలు లభించినందున ఆయనను సాగనంపడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ ఫైళ్లు సమర్పించడం ద్వారా తనను తప్పుదారి పట్టించినట్లు గుర్తించిన కలెక్టర్ డీఎంహెచ్‌ఓ వ్యవహారశైలిని సీరియస్‌గా పరిగణించారు. ఈ మేరకు ఆయనకు చార్జి మెమో జారీచేయాలని డీఆర్‌ఓ వెంకటేశ్వర్లును ఆదేశించారు. తాజాగా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా అవినీతికి పాల్పడుతున్నట్లు కథనాలు వెలువడడం.. అందుకు ఆధారాలు కూడా లభించడంతో సుధాకర్‌నాయుడుపై చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు కలెక్టర్ ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు