లాక్‌ డౌన్‌ అమలులో రాజీ పడొద్దు 

2 Apr, 2020 04:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ఆదేశం

సాక్షి, అమరావతి: రెండు వారాల పాటు లాక్‌ డౌన్‌ అమలులో రాజీ పడొద్దని.. దీనిని మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల అమలుపై బుధవారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నందున ప్రజలను ఆదుకునేందుకు ప్రధాని ప్రకటించిన ప్యాకేజీని అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా అమలు చేసేందుకు  చర్యలు తీసుకోవాలి. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి. వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
► ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. రాష్ట్రానికి మరిన్ని టెస్టింగ్‌ కిట్లు అవసరం ఉందన్నారు.

దుకాణాల వద్ద ధరల పట్టికలు
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారందరినీ విధిగా హోం ఐసోలేషన్‌లో ఉంచాలని సీఎస్‌ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..
► రైతు బజార్లు, నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాల వద్ద ధరల వివరాలతో పెద్ద సైజు బోర్డులు ఏర్పాటు చేయాలి. 
► అన్ని పట్టణాల్లో ఇంటింటా సర్వేను పటిష్టంగా నిర్వహించాలి. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచిన ప్రతి వ్యక్తికీ ప్రత్యేక రూమ్‌లు, బాత్‌ రూమ్‌లు ఉండేలా చూడాలి. పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించే సర్వే ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించాలి.

ఎన్‌–95 మాస్క్‌లు పంపించాం
► విజయవాడ ఆర్‌ అండ్‌ బీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలకు ఎన్‌–95 మాస్క్‌లు, పీపీఈ పరికరాలు సరఫరా చేశామన్నారు. వాటిని కరోనా  బాధితులకు సేవలందించే వారికి ఇవ్వాలి
► వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, మున్సిపల్‌ పరిపాలన శాఖ కమిషనర్‌ విజయకుమార్, విపత్తులు నిర్వహణ ప్రత్యేక కమిషనర్‌ కె.కన్నబాబు, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ విజయకృష్ణన్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె.భాస్కర్‌ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు