నాథులు నాస్తి

14 Feb, 2015 02:05 IST|Sakshi
నాథులు నాస్తి

►జిల్లాలో ‘స్మార్‌‌ట’కు ఎంపికైన 1,069 గ్రామాలు,364 వార్డులు
►దత్తతకు ముందుకు రాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,అధికారులు
►ప్రచారంలో చూపిన ఉత్సాహం అమలులో చూపని ప్రభుత్వం

 
సాక్షి ప్రతినిధి, కాకినాడ :స్మార్ట్ సిటీ.. స్మార్ట్ విలేజ్.. స్మార్ట్ వార్డు.. కొంత కాలంగా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల నోట ఈ పదమే వినిపిస్తోంది. సర్కార్ కూడా ‘స్మార్ట్...స్మార్ట్’ అన్న ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. గ్రామాలు, వార్డులన్న తేడా లేకుండా అన్నింటినీ స్మార్ట్‌గా చేయాలని ఆదేశించింది. గత నెల 18న స్మార్ట్ విలేజ్‌లో పాదయాత్ర చేపట్టాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరిలో తనవంతు పాదయాత్ర చేశారు. అదే రోజు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం జె.తిమ్మాపురంలో స్మార్ట్ యాత్ర చేశారు. ప్రారంభం రోజు జిల్లాలో ప్రజాప్రతినిధులు మరీ ముఖ్యంగా అధికారపార్టీ వారు.. ఖర్చు లేదు కదా అని పాదయాత్రలు చేసేశారు. అంతటితో  పని అయిపోయిందనుకున్నారో ఏమో కాని ఆ తరువాత స్మార్ట్‌కు ఎంపికైన గ్రామాలు, వార్డులను దత్తత తీసుకుని అభివృద్ది చేయాలన్న సర్కార్ లక్ష్యాన్ని గాలికొదిలేశారు.

జిల్లాలో ఎంపిక చేసిన 1,069 గ్రామాలు, అర్బన్ ప్రాంతాల్లో 364 వార్డుల్లో ప్రజలు ఎవరు ముందుకు వచ్చి దత్తత తీసుకుంటారా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. సర్కారు సంకల్పం ప్రకారం వాటిని ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేట్ సంస్థలు, అధికారులు, ఇతర ప్రముఖులు దత్తత తీసుకుని సమగ్రాభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ఐదువేల జనాభా ఉన్న గ్రామాలను అధికారులు,5 వేల నుంచి 10 వేల జనాభా కలిగిన వాటిని ఎంపీలు, ఎమ్మెల్యేలు, 10 వేలపై బడి జనాభా ఉన్న వాటిని కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతి స్మార్ట్ గ్రామం, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆరుబయట మలవిసర్జన అరికట్టడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఆస్పత్రుల్లో నూరుశాతం ప్రసవాలు, తల్లీ, పిల్లల మరణాలను, డ్రాప్ అవుట్లను తగ్గించడం, అందరికీ  విద్యుచ్ఛక్తి, ఫిర్యాదుల పరిష్కార మార్గాలు, అందుబాటులోకి క్షేత్రస్థాయి సమాచారం, టెలికం, ఇంటర్‌నెట్, ప్రజల జీవనప్రమాణాల పెంపు తదితర 20 అంశాల్లో ప్రగతికి బాట వేయాలనేది స్మార్ట్ లక్ష్యం. దీనిని సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, సీపీఓ కన్వీనర్‌గా, పలు శాఖల అధికారులు సభ్యులుగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలన్నారు. దత్తత తీసుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 54 మంది మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అంటే జిల్లాలో స్మార్ట్‌కు ఎంపికైన సంఖ్య, ఇంతవరకు ఆన్‌లైన్‌లో నమోదుచేసుకున్న వారి సంఖ్య మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.

ఎంపీల దత్తతా మొక్కుబడే..

ఇంతవరకు జిల్లాలోని ముగ్గురు ఎంపీలు మూడేసి గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తీరా తొలి దశలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటామని దరఖాస్తు చేయడం గమనార్హం. కాకినాడ ఎంపీ తోట నరసింహం తొలుత గొర్రిపూడి, రాయభూపాలపట్నం, బూరుగుపూడిలను దత్తత తీసుకుంటున్నట్టు చెప్పారు. కానీ మొదటి విడతలో సొంత నియోజకవర్గంలోని బూరుగుపూడిని ఎంపిక చేసుకున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పుల్లేటికుర్రు, కందికుప్ప గ్రామాలను ఎంపిక చేసుకున్నా చివరకు పుల్లేటికుర్రుకే పరిమితమయ్యారు.

రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తొలివిడత జిల్లాలో ఒక్క గ్రామాన్నీ దత్తత తీసుకోలేదు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మారేడుమిల్లిని ఎంపిక చేసుకున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం అసలు స్మార్ట్ వైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. ఆ విషయం ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలనలో స్పష్టమవుతోంది. దరఖాస్తు చేసుకున్న 54 మంది కూడా జిల్లాకు చెంది పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్‌జీఓలు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు తమ ప్రాంతంపై అభిమానంతో ముందుకొచ్చిన వారే.

తొండంగిని దత్తత తీసుకున్న కలెక్టర్..

అధికారుల విషయానికి వచ్చేసరికి ప్రగతి మరీ నిరాశాజనంగా ఉంది. జిల్లాకు ఇటీవలే వచ్చినా కలెక్టర్ అరుణ్‌కుమార్ తొండంగి మండలంలో మత్స్యకార గ్రామం దానవాయిపేటను దత్తత తీసుకున్నారు. ఆ విషయాన్ని స్మార్ట్ విలేజెస్‌పై కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రకటించారు. అధికారులంతా విధిగా గ్రామాల్ని దత్తత తీసుకోవాలని నొక్కి చెప్పారు.వారానికి రెండు, మూడుసార్లు జిల్లాస్థాయిలో స్మార్ట్ విలేజెస్‌పై సమీక్షలు నిర్వహిస్తున్నా స్పందన అంతంత మాత్ర మే.

‘ఎంపీలకైతే ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి, మాకు వచ్చే ఏసీడీపీ నిధులూ లేకుండా చేసిన ప్రభుత్వం ఇప్పుడు దత్తత తీసుకోమంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని ఎమ్మెల్యేలు  ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు ఇవ్వకుండా పోతుందా అని ఎదురుచూస్తున్నారు. అధికారులు మాత్రం స్మార్ట్‌పై అవగాహన కార్యక్రమాల ఏర్పాట్లలో ఉన్నారు. ఈ నెల 13న కాకినాడలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. స్మార్ట్ ప్రచారంలో ఉన్న ఉత్సాహం అమలులో కూడా చూపించాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉంది.

మరిన్ని వార్తలు