కష్ట కాలంలో పోటీచేశాం.. మర్చిపోకండి!

20 Jul, 2014 00:18 IST|Sakshi

 సాక్షి, గుంటూరు: పార్టీ ఇబ్బందుల్లో ఉందని తెలిసినా చిత్తశుద్ధితో పనిచేశామని, ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటుతున్నా ఇంత వరకూ పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పదవులు అనుభవించిన ఎంతోమంది బడా నాయకులు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చినప్పటికీ  ఓటమి భయంతో పోటీ చేయకుండా వెనక్కు వెళ్ళారని, అలాంటి వారికి ఇప్పుడు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఎలా అప్పజెబుతారంటూ అధిష్టానంపై మండిపడుతున్నారు.
 
 నియోజకవర్గంలో తమకు ఎలాంటి ప్రాధాన్యం కల్పిస్తున్నారనే అంశంపై గత నెల విజయవాడలో జరిగిన విసృ్తతస్థాయి సమావేశంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై వీరు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసలు పార్టీలో తమ ప్రాధాన్యమేమిటో చెప్పకుండా ఇప్పుడు సమీక్షల పేరుతో పార్టీని పునఃనిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశామని, పార్టీ నుంచి వచ్చిన కొద్దోగొప్పో డబ్బును కూడా నాయకులు కాజేశారే తప్ప చిల్లిగవ్వ కూడా తమకు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇద్దరు వ్యక్తులు పార్టీని అడ్డుపెట్టుకొని మంత్రి పదవులు అనుభవించి తీరా ఎన్నికలు వచ్చేసరికి పోటీ నుంచి పక్కకు తప్పుకుని తమని బలిపశువులుగా మార్చారని వాపోతున్నారు.
 
 తాడోపేడో తేల్చుకుంటాం..
 కాంగ్రెస్‌పార్టీ   జిల్లా కార్యాలయంలో ఆదివారం  పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశంలో తాడో పేడో తేల్చుకునేందుకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధమౌతున్నట్లు సమాచారం.  తమను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించాలంటూ రఘువీరారెడ్డిని నిలదీసేందుకు కొందరు సిద్ధమౌతున్నట్లు తెలిసింది. తమను కాదని సీనియారిటీ పేరుతో పోటీ నుంచి తప్పుకున్న వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరిసున్నారు. అలాగని పెండింగ్ పెట్టినా ఊరుకోబోమని అంటున్నారు.
 
 మేం పార్టీ మారాం..  
 సమీక్షా సమావేశానికి హాజరుకావాలంటూ  అనేక మంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఫోన్‌లు రావడంతో ‘మేం పార్టీ మారాం.. మీవాళ్ళను పిలుచుకోండి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఎవరికి ఫోన్ చేయాలో, ఎవరికి చేయకూడదో తెలియక పార్టీ కార్యాలయ సిబ్బంది తలలుపట్టుకు కూర్చున్నారు. ఎవరు పార్టీలో ఉన్నారో.. ఎవరు పార్టీని విడిచారో తెలియని దారుణమైన పిరిస్థితి తామెప్పుడూ చూడలేదని పార్టీ కార్యాలయ సపిబ్బంది వాపోతున్నారు.
 

>
మరిన్ని వార్తలు