కిక్కెక్కడం లేదు

29 Nov, 2014 02:23 IST|Sakshi
కిక్కెక్కడం లేదు

ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని మందు బాబులు గగ్గోలు  పెడుతున్నారు.. ఎంత తాగినా కిక్కెక్కడం లేదని ఆరోపిస్తున్నారు. మద్యంలో నీళ్లను కలుపుతుండటమే ఇందుకు కారణం. అధికారులు పట్టించుకోకపోవడంతో మద్యం వ్యాపారులు కల్తీ మద్యాన్ని యధేచ్చగా  విక్రయిస్తున్నారు. అయినా గిట్టుబాటు కావడం లేదని  కల్తీకి తోడు ధరలు కూడా పెంచేశారు.  

వాణిజ్య కేంద్రంగా పేరుపొందిన ప్రొద్దుటూరులో మద్యం వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 మద్యం షాపులు ఉన్నాయి.  8 బార్‌లు ఉన్నాయి. కొన్ని రోజులుగా తమకు నీళ్లు కలుపుతున్న మద్యాన్ని విక్రయిస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

నెలకు 850 బాక్స్‌లు విక్రయించాల్సిందే..
ఈ ఏడాది జూలై నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి.  బెల్ట్ షాపులు లేనందున ఎక్సైజ్ అధికారులు  మద్యం వ్యాపారులకు టార్గెట్‌లు విధించలేదు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది విక్రయాలు బాగా తగ్గాయని భావించిన ఎక్సైజ్ అధికారులు తాజాగా టార్గెట్‌లు విధించారు. ఒక్కో  షాపులో నెలకు 850 బాక్స్‌ల మద్యం సీసాలు విక్రయించాలని టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది.

టార్గెట్ విధించిన నేపథ్యంలో  అధికారులు, వ్యాపారుల మధ్య పరస్పర అంగీకారం జరిగినట్లు సమాచారం.  ఎమ్మార్పీపై రూ. 5 పెంచి విక్రయించుకుంటామని వ్యాపారులు అడగడంతో ఎక్సైజ్ అధికారులు తలాడించినట్లు తెలుస్తోంది.  దీంతో  నాలుగు రోజుల నుంచి పట్టణంలోని మద్యం షాపుల్లో ఎమ్మార్పీ కంటే రూ. 5 అదనంగా వసూలు చేస్తున్నారు.  ఇదిలా ఉండగా పట్టణంలోని పలు మద్యం షాపుల్లో ఉదయం 9 నుంచే విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం శాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

నా దృష్టికి వచ్చింది.. కేసులు రాస్తాం
ఎమ్మార్పీ కంటే రూ.5 అదనంగా విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని  ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంభూప్రసాద్ వివరణ ఇచ్చారు.  మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించి కేసులు రాయమని సీఐకి ఆదేశాలు జారీ చేశామన్నారు.  ఆయన రాయకుంటే తానే రాస్తానన్నారు. టార్గెట్‌లు విధించిన మాట వాస్తవమేనని..అయితే ఎమ్మార్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలన్నారు.   టార్గెట్‌కు ధరలకు సంబంధం లేదన్నారు.

మరిన్ని వార్తలు