‘తొడగొట్టే సంస్కృతి అవసరం లేదు’

1 Apr, 2018 18:03 IST|Sakshi
జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌

విజయవాడ : రాజకీయాలలో తొడగొట్టే సంస్కృతి అవసరం లేదని, ఎటువంటి అంశాన్ని అయినా సున్నితంగా చెబితే సరిపోతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం  సిద్ధార్థ అకాడమీలో మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ రచించిన "తలుచుకుందాం... ప్రేమతో" అనే పుస్తక  ఆవిష్కరణ  పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నేటి రాజకీయ వ్యవస్థలో సత్యానికి(నిజానికి) స్థానం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ సత్యం-అహింసలే ఆయుధంగా సామాజిక మార్పు తెచ్చారని, యలమంచిలి శివాజీ మాదిరిగా తెలుగులో రాజకీయ నేతలు సమాజానికి స్పూర్తి దాయకమైన రచనలు చేయాలని సూచించారు.

ఎక్కువగా ఇంగ్లీషులోనే ఈ తరహా రచనలు వస్తున్నాయన్నారు. యలమంచిలి శివాజీ తన పుస్తకం ద్వారా ప్రముఖులతో తన అనుబంధాలను చక్కగా వ్యక్తీకరించారని అన్నారు. తనను ప్రభావితం చేసిన ప్రముఖుల వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. నేటితరం రాజకీయ నాయకుల్లో రచనా వ్యాసాంగం పట్ల ఆసక్తి లేకుండా పోతోందన్న బాధ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెస్కో విజయ్ కుమార్, చంద్రశేఖర్, ప్రమీలా రాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు