వామ్మో...అనాథ శవమా!

3 Feb, 2015 01:57 IST|Sakshi
వామ్మో...అనాథ శవమా!

హడలిపోతున్న రైల్వే పోలీసులు
ఖననానికి స్థలం లేదు
ఖర్చులకు నగదు చాలదు
 

 రైల్వేస్టేషన్ : ట్రాక్ పక్కన అనాథ శవం ఉందని సమాచారం అందితే చాలు రైల్వే పోలీసులు హడలిపోతున్నారు.  ఖననం చేయడానికి స్థలం లేక, రైల్వే శాఖ ఇచ్చే మొత్తం చాలక పోలీసులు  ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ రైల్వే జంక్షన్ మీదుగా నిత్యం మూడు వందలకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ రైల్వే పోలీసుల పరిధిలో అటు తెలంగాణ సరిహద్దు ఖమ్మం వరకు, గుడివాడ వైపు, కృష్ణా కెనాల్, గన్నవరం వైపు వివిధ రైళ్లు వస్తుంటాయి. రైలు కింద పడి ఆత్మహత్య, రైలు ఢీకొన్న ఘటనలు, రైలు నుంచి జారిపడి మృత్యువాత పడిన కేసులు నెలలో సుమారు పది నుంచి పదిహేను వస్తుంటాయి. వీటిలో అత్యధిక శాతం మంది వద్ద ఎలాంటి ఆధారాలు ఉండవు. దీంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేయాలి. మృతదేహాన్ని  ఘటనా స్థలం నుంచి తరలించినప్పటి నుంచి పోస్టుమార్టం అయ్యేవరకూ సుమారు రూ.4 వేల ఖర్చవుతోంది.         

ఘటన జరిగినట్లుగా రైల్వే సిబ్బంది నుంచి సమాచారం వస్తేనే షౌటెడ్ చార్జిల కింద వెయ్యి రూపాయలు రైల్వే శాఖ నుంచి పోలీసులకు అందుతుంది. 108 ద్వారా వెళ్లినా, హాస్పిటల్ నుంచి సమాచారం వచ్చినా వారికి ఆ వెయ్యి రూపాయలు కూడా రావు. మిగిలిన ఖర్చులు పోలీసులే భరించాలి. దీంతో అనాథ శవాలు వచ్చాయంటే పోలీసులు ఆమడ దూరం పరిగెడుతున్నారు. షౌటెడ్ చార్జిలను పెంచాలంటే సికింద్రాబాద్‌లోని జీఎం కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో కొన్నేళ్లుగా అదే వెయ్యి రూపాయలతో సిబ్బంది నెట్టుకొస్తున్నారు.

ఖననం చేసేందుకు స్థలం కొరత  

మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలం లేక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో కుమ్మరిపాలెం నీలిమా థియేటర్ సమీపంలో ఉన్న శ్మశానవాటికలో మృత దేహాలను ఖననం చేసేవారు. స్థానిక కార్పొరేటర్ బయట ప్రాంత శవాలను ఇక్కడ ఖననం చేయడానికి వీలులేదని కౌన్సిల్‌లో ప్రతిపాదన పెట్టడంతో ప్రస్తుతం ఈ అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో రైల్వే పోలీసులు  సింగ్‌నగర్ వాంబేకాలనీలో ఉన్న శ్మశానవాటికలో ఖననం చేస్తున్నారు. రైల్వేకి సంబంధిం చిన మృతదేహం కావడంతో పాతి పెట్టాలంటే బయటవారితో గొయ్యి తీయించుకోవాలని సిబ్బంది చెబుతున్నారు.

గొయ్యి తీయడానికి రూ.2,500 తీసుకుంటున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు, పోస్టుమార్టం, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.1,500 అవుతున్నాయని పోలీ సులు చెబుతున్నారు. కొన్ని రోజుల తర్వాత పేపర్లో పడిన ఫొటోలను చూసి మృతుల బంధువులు వస్తారని దీంతో మృతదేహాలను తిరిగి బయటకు తీయాల్సి వస్తుందని ఈ కారణంతోనే పూడ్చిపెడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. లేకుంటే కృష్ణలంకలో ఉన్న కరెంటు మిషన్‌ను ఉపయోగించుకొనే వారమని  చెబుతున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రైల్వే బోర్డు కూడా ఈ షౌటెడ్ చార్జీలు పెంచాలని కోరుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు