ఆకలి కేకలు..

14 Nov, 2013 03:40 IST|Sakshi

వరంగల్, న్యూస్‌లైన్:  సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలోని గిరిజన బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు సరుకులు సరఫరా కావడం లేదు. ఉప్పు, సబ్బులు కూడా ఇవ్వడం లేదు. నిత్యావసర వస్తువులను సరఫరా చేసే గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు ప్రభుత్వం బాకీ పడింది. దీంతో గిరిజన విద్యార్థులకు భోజనం కష్టంగా మారుతోంది. వీటితో పాటు కాస్మొటిక్స్ కూడా అందించడం లేదు. ఇక ఎప్పుడో నెలకు రెండుసార్లు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఒకసారి సరఫరా చేసి మళ్లీ ముఖం చాటేస్తున్నారు. వచ్చినప్పుడే గుడ్లను పెడుతున్నారు. విద్యార్థులకు ప్రతీ రోజూ కోడిగుడ్లను పెట్టాల్సినప్పటికీ వారంలో ఒక్కరోజు కూడా ఇవ్వడం లేదు. ఇక అరటి పండ్లు ఇవ్వడమే మరిచిపోయారు.

అరటిపండ్లను తీసుకువచ్చే కాంట్రాక్టర్లు నెలకు నాలుగుసార్లు ఇచ్చి పోతున్నారు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రోజూ విద్యార్థులకిస్తున్నట్లుగానే లెక్కలేసుకుంటున్నారు. వీటన్నింటిపైనా విద్యార్థులు మాట్లాడితే చాలు... వార్డెన్ల  దెబ్బల తినాల్సిందే. దీంతో సరుకులు రావడం లేదని చాటుమాటుగా చెబుతున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 70, ఇతర వసతి గృహా లు 42 ఉన్నాయి. వీటిల్లో సుమారు 23వేల మంది గిరిజన విద్యార్థులు ఉంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ కోసం ఆలస్యంగా టెండర్లు నిర్వహించారు. గిరిజన సహకార సంస్థ(జీసీసీ), ఇతర కాంట్రాక్టర్ల ద్వారా కాస్మొటిక్స్, బ్యియ్యం, పప్పులు, నూనెతో సహా 23 రకాల వస్తువులు సరఫరా చేయాల్సి ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి హాస్టల్ నిర్వాహణకు సరిపడా సరుకులు నిల్వ చేయాల్సి ఉండగా... అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు నెలల్లో ఒక్క నెలకు కూడా సరుకులు అందించడం లేదు.

హాస్టళ్ళలో అవసరమున్న సరుకుల కోసం హెచ్‌ఎంలు గిరిజన సహకార సంస్థకు ఇండెంట్ పెడతారు. కావలసిన సరుకులను వెంటనే సరఫరా చేయాల్సిన జీసీసీ... వారికి ఇష్టంవచ్చినప్పుడు సరఫరా చేస్తుండటంతో విద్యార్థులకు మెనూ ప్రకారంగా పౌస్టికాహారం అందడం లేదు. మంగపేట మండలం కోమటిపల్లి హాస్టల్‌లో వారం రోజుల కిందట కోడిగుడ్లు అయిపోయాయి. అప్పటి నుంచి విద్యార్థులకు గుడ్లు ఇవ్వడం లేదు. ఇదే  హాస్టల్‌కు గత నెల మొదటి వారంలో సరఫరా చేయాల్సిన సరుకులను మంగళవారం సరఫరా చేశారు. అంతేకాకుండా హాస్టళ్ళకు గిరిజన సహకార సంస్థ సరఫరా చేస్తున్న సరుకులు కూడా నాణ్యతలేని నాసిరకం సరుకులను సరఫరా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  
 జీసీసీకి రూ 1.90 కోట్లు పెండింగ్
 ఇదే సమయంలో సర్కారు నిధులు విడుదల చేయడంలో కూడా నిర్లక్ష్యమే చేస్తోంది. మూడు నెలల నుంచి సరఫరా చేసిన సరుకుల బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, వసతి గృహాలకు సరఫరా చేసిన సరుకులకు రూ 1.90 కోట్లు జీసీసీకి బాకీ పడ్డారు.  అదే విధంగా అరటి పండ్లు, పాలు, కాస్మొటిక్స్ విద్యా సంవత్సరం మొదట్లో సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు కూడా ఇంకా బిల్లులు పెండింగ్ పడ్డారు. ఈ బిల్లు కూడా మరో రూ 60 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.   బిల్లులు పెండింగ్ ఉండటంతో మళ్లీ సరుకులు సరఫరా కావడం లేదు.

వార్డెన్లు కూడా విద్యార్థులకు పెట్టడం లేదు. కానీ, లెక్కల బుక్కుల్లో మాత్రం గిరిజన విద్యార్థులు పౌష్టికాహారం దండిగా తింటున్నారు. గతంలో వార్డెన్లు అత్యవసర వస్తువులను సొంతంగా కొనుగోలు చేసి విద్యార్థులకు అందించే అవకాశాలుండేవి. ఇప్పుడు వాటన్నింటినీ టెండర్లపరం చేయడంతో అధికారాలు లేకుండా పోయాయి. ఏవైనా సరుకులను అత్యవసరంగా కొనుగోలు చేద్దామంటే తమకు బిల్లులివ్వడం లేదని, దీంతో తామేం చేయలేకపోతున్నామని వార్డెన్లు బహిరంగంగానే చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు