ప్రజలు చనిపోతున్నా మీకు పట్టదా?

2 Nov, 2017 02:36 IST|Sakshi

ప్రైవేటు రవాణా సంస్థల ఉల్లంఘనలపై ఏం చర్యలు తీసుకున్నారు?

ఉభయ రాష్ట్రాల తీరుపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం

తదుపరి విచారణ 7కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ఉభయ రాష్ట్రాల్లోని ప్రైవేటు రవాణా సంస్థల ఉల్లంఘనలపై తాము కోరిన వివరాలను సమర్పించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రైవేటు రవాణా సంస్థలను కాపాడేందుకే కాలయాపన చేస్తున్నట్లుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రవాణా సంస్థల తీరు వల్ల ప్రజలు మరణిస్తున్నా మీకు పట్టదా? అంటూ నిలదీసింది. మోటారు రవాణా కార్మికుల చట్టం ప్రకారం నమోదు చేసుకోకుండా, డ్రైవర్ల పని గంటల విషయంలో నిబంధనలు పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్న రవాణా సంస్థలను, వాటిపై తీసుకున్న చర్యలు తదితర వివరాలను తమ ముందుంచాల్సిందేనని ఉభయ రాష్ట్రాల రవాణా శాఖల కమిషనర్లకు స్పష్టం చేసింది. వచ్చే విచారణ నాటికి ఈ వివరాలను ముందుంచని పక్షంలో స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మోటారు వాహన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉభయ రాష్ట్రాల్లో ఆపరేటర్లు బస్సులు నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలోనే ముండ్లపాడు వద్ద దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం జరిగిందంటూ న్యాయవాది కె.వి.సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్‌ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే కోర్టు ముందు ఓ నివేదికను ఉంచారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోకుండా జరిమానాలతో సరిపెట్టడమేనా? మీరు చేస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది. లైసెన్సులు రద్దు చేయకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నివేదిక దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం కనీసం ఏదో ఒక నివేదిక అయినా ఇచ్చింది.. మీరు మాత్రం అది కూడా చేయలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు