తీర్థయాత్రకు వెళ్తే.. ఇల్లు దోచేశారు

29 Sep, 2014 01:42 IST|Sakshi
తీర్థయాత్రకు వెళ్తే.. ఇల్లు దోచేశారు
  • యలమంచిలిలో భారీ చోరీ
  •  స్వర్ణకారుడి ఇంట్లో 20 తులాల బంగారం..  రెండు కేజీల వెండి అపహరణ!
  •  తిరుమలలో ఉన్న బాధిత కుటుంబానికి సమాచారం
  •  రంగంలోకి దిగిన క్లూస్ టీమ్
  •  ప్రొఫెషనల్ దొంగల పనేనని అనుమానాలు
  • యలమంచిలి : తిరుమల తీర్థయాత్రకు వెళ్లిన స్వర్ణకారుడి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. సంచలనం కలిగించిన ఈ చోరీ ఘటన ఆదివారం వెలుగుచూసింది.  ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు, బాధితుని మామ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో ఉలక్‌పేట వీధిలో స్వర్ణకారుడు బిల్లకుర్తి శ్రీనివాస్ కుటుంబం నివాసముంటోంది. గత గురువారం శ్రీనివాస్, భార్య శ్రీదేవి, కుమార్తె ఝాన్సీతో కలిపి కుటుంబమంతా తిరుమల తీర్థయాత్రకు వెళ్లారు.

    ఆదివారం ఉదయం పనిమనిషి నాగమణి వచ్చి ఇంటి ఎదుట శుభ్రం చేస్తుండగా ఇంటి ప్రధాన ద్వారానికి డోర్ కర్టెన్ పూర్తిగా వేసి ఉండటం గమనించింది. దగ్గరకు వెళ్లి చూడగా తలుపు తెరిచి ఉన్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని చుట్టుపక్కల ఇళ్ల వారికి తెలియజేసింది. వారు వెంటనే ఫోన్ ద్వారా ఇంటి యజమాని శ్రీనివాస్‌కు సమాచారం అందజేశారు.
     
    ఇదీ దొంగతనం జరిగిన తీరు!

    ఈలోగా పట్టణ పోలీసులు చోరీ జరిగిన ఇంటికి చేరుకుని పరిశీలించగా ఇంట్లో పడక గదుల్లో బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. సీక్రెట్ లాకర్లు విరగొట్టబడి ఉన్నాయి. బీరువాల్లో దుస్తులన్నీ చిందరవందరగా పడవేసి ఉన్నాయి. హాల్, వంటగదుల్లోని సామాన్లు చిందరవందర చేయబడి ఉన్నాయి.

    20 తులాల బంగారం, రెండు కేజీల వెండి, రూ.15వేల నగదు అపహరించుకుపోయినట్లు కుటుంబ యజమాని శ్రీనివాస్ మామయ్య ఆరిపాక నూకేశ్వరరావు అలియాస్ జయబాబు పోలీసులకు తెలిపారు.  అల్లుడి నుంచి సమాచారం రాగా తాను ఇక్కడికి వచ్చానన్నారు. రూరల్ ఎస్‌ఐ కంచుమోజు రామకృష్ణ చోరీ జరిగిన ఇంటిని, పరిసరాలను గమనించారు. అనంతరం సీఐ మల్లేశ్వరరావుకు సమాచారం అందజేశారు. ఆయన రూరల్ ఎస్పీకి తెలియజేయడంతో, ఆయన ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ సభ్యులు హుటాహుటిన యలమంచిలి చేరుకున్నారు.
     
    రంగంలోకి క్లూస్ టీమ్

    క్లూస్ టీమ్ ఏఎస్‌ఐ ఎస్.లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం ఉలక్‌పేటలో చోరీ జరిగిన ఇంటికి వెళ్లి ఆధారాలు సేకరించారు. తలుపులు, వస్తువులు, బీరువాలకు ఉన్న ఏడు రకాల వేలిముద్రలను సేకరించారు. దొంగలు ఇనుపరాడ్లతో ఇంటి ప్రధాన ద్వారా విరగ్గొట్టి లోనికి ప్రవేశించినట్టు గుర్తించారు.
     
    ప్రొఫెషనల్స్ పనే!

    గదుల్లో నేలపై కారంపొడి చల్లడంతో ఇది ప్రొఫెషనల్ దొంగలపనేనని పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోని సబ్బవరం, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో ఇటీవల వరుసగా చోరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో యలమంచిలిలో జరిగిన చోరీ కూడా దొంగల ముఠా సభ్యులే చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. చోరీ జరిగిన ఇంట్లో కుటుంబ సభ్యులంతా తిరుమల తీర్థయాత్రకు వెళ్లడంతో వారు సోమవారం యలమంచిలి చేరుకునే అవకాశం ఉంది. సోమవారం వారి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసును దర్యాప్తు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
     

మరిన్ని వార్తలు