సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ బాబూలాల్‌ 

29 Jun, 2019 07:55 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌(ఎఫ్‌ఏసీ)గా ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాబూలాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్‌ బాబూలాల్‌ ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఈయనను తక్షణమే సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరాలంటూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  డాక్టర్‌ లాల్‌ విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా 2018 మే నుంచి పనిచేస్తూ ఉద్యోగులు, వైద్యులను సమన్వయపరుస్తూ సమర్థంగా విధులు నిర్వహించారు.

ఆయనకు ముందు పనిచేసిన వారు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొనగా, డాక్టర్‌ లాల్‌ మాత్రం ఏడాదిగా ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పనిచేస్తూ వచ్చారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా పనిచేశారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌గా, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉండగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డాక్టర్‌ జగన్నాథ్‌ను నిబంధనలకు విరుద్ధంగా సూపరింటెండెంట్‌ పోస్టులో నియమించడం తెలిసిందే. 19 మంది ప్రొఫెసర్లను కాదని ఆయనకు ఆ పోస్టు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఆయనను ప్రభుత్వం సూపరింటెండెంట్‌ విధుల నుంచి తప్పించింది. 

మరిన్ని వార్తలు