అనుమానాస్పద స్థితిలో వైద్యురాలు మృతి

11 Feb, 2014 03:15 IST|Sakshi

 మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :  మంచిర్యాలలో వైద్యురాలు నవ్య(26) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఉదయం బాత్రూంలో విగతజీవిగా కనిపించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రేడియాలజిస్టు రాంబాబు కూతురు నవ్యకు పెద్దపల్లికి చెందిన జనరల్ ఫీజిషియన్ మనోజ్‌కుమార్‌తో 2009 ఆగస్టు 8న వివాహం జరిగింది. నవ్య గైనకాలజిస్టుగా పట్టభద్రురాలు కావడంతో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో నిత్య నర్సింగ్‌హోం తెరిచారు.

 ఆమె ఏడాదిపాటు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేసింది. పీజీ చేయడానికి శిక్షణ పొందుతూ ఈ నెల చివరి వారంలో పరీక్షకు సిద్ధమవుతోంది. వీరికి ఏడాదిన్నర వయసు ఉన్న కుమారుడు లక్కీ ఉన్నాడు. వారం క్రితమే కుటుంబ సభ్యులు కలిసి తిరుపతికి వెళ్లొచ్చారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చలనం లేకుండా పడి ఉందని భర్త మనోజ్‌కుమార్ తెలిపాడు.

ఎన్ని గంటలకు చనిపోయిందనేది చెప్పడం లేదు. దీంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవ్య మృతదేహాన్ని బెల్లంపల్లి చౌరస్తాలోని తన తండ్రి రాంబాబు నివాసానికి తరలించారు. మృతురాలి భర్త, అతడి తల్లిదండ్రులు రావడంతో నవ్య కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నవ్యను పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు పంపించారు

 పోలీసుల విచారణ
 రాంబాబు ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి సీఐ కరుణాకర్, ఎస్సై వెంకటేశ్వర్లు, తహశీల్దార్ రవీందర్ విచారణ చేపట్టారు. నవ్య పడక గదిని పరిశీలించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందా..? లేక భర్తే హత్య చేసాడా..? సహజ మరణమా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నవ్య భర్త అనుకుని ఫణికుమార్ అనే వైద్యుడిని పోలీసులు జీపులో పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని యత్నించడం కొద్దిసేపు వివాదానికి దారి తీసింది.

 ఉదయం ఆస్పత్రులు బంద్
 నవ్య మరణంతో ఉదయం ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు. వైద్యులు రమణ, అన్నపూర్ణ, మల్లేశ్, రమేశ్‌బాబు, నర్సయ్య, రాజగోపాల్, బద్రి నారాయణ, నాగమల్లేశ్వర్‌రావు, పురపాలక సంఘం మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు