కరోనా వైరస్‌: ఆరోగ్య ప్రదాతలు

6 Apr, 2020 08:07 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

కనిపించే దేవుళ్లు వైద్యులు అంటారు. అది ముమ్మాటికీ నిజమని ప్రస్తుత పరిస్థితిలో అంగీకరించకతప్పదు. కరోనా మహమ్మారిని జయించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్‌డౌన్‌ పిలుపుతో ప్రజలు చాలావరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. 

సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ వైద్య సేవలకు ఎటువంటి అంతరాయమూ లేకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 45 లక్షలకు పైగా ఉన్న జనాభా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఓ వైపు కోవిడ్‌ పరీక్షలు చేస్తూనే మరోవైపు సాధారణ చెకప్‌లు, అత్యవసర సేవలు, కాన్పులు, జ్వరం, జలుబు, దగ్గు, శరీర నొప్పులను పరీక్షిస్తూ మందులు ఇస్తున్నారు. తిరుపతి, చిత్తూరులో కోవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసి, అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు కలి్పంచి, అనుమానితులకు, పాజిటివ్‌ కేసులకు వైద్యం అందిస్తున్నారు. 

నిరంతర సేవలు 
జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో నిరంతర వైద్య సేవలు అందుతున్నాయి. జిల్లాలో 602మంది వైద్యులు, 700 మంది నర్సులు, 1,200 మంది ఎఎన్‌ఎంలు, 227 మందికి పారా మెడికల్‌ సిబ్బంది, 390 మంది శానిటేషన్, క్లాస్‌–4 సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు 175 మంది 108 సిబ్బంది 40 అంబులెన్స్‌ల ద్వారా అత్యవసర సేవల్లో నిమగ్నమయ్యారు. 3వేల మంది ఆశ కార్యకర్తలు, 80 మంది వైద్యమిత్రలు, 400 సబ్‌సెంటర్ల సూపర్‌వైజర్లు రోగులకు సేవలను అందిస్తున్నారు. 

జిల్లా ఆస్పత్రుల్లో.. 
జిల్లా ఆస్పత్రులైన చిత్తూరు, మదనపల్లెలోని క్యాజువాలిటీలో జ్వరం, జలుబు, దగ్గుతో పాటు అత్యవసర సేవలు అందిస్తున్నారు. అవసరమైతే రోగిని వార్డులో అడ్మిట్‌ చేసి సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు జిల్లాలో రోజుకు 42మంది తల్లు్లకు పురుడు పోస్తున్నారు. ఇక పీహెచ్‌సీ, సబ్‌సెంటర్లలో రోగులు జ్వరం, జలుబు, బీపీ, షుగర్‌ వంటి రోగాలకు పరీక్షలు చేసుకుంటూ, మందులు తీసుకుంటున్నారు. 

టెలీ మెడిసిన్‌ 
జిల్లాలోని 101 పీహెచ్‌సీ, 9 సీఎం ఆరోగ్య కేంద్రాల్లో బీపీ, షుగర్, గైనిక్‌ తదితర సమస్యలకు టెలీ మెడిసిన్‌ ద్వారా వైద్యం చేస్తున్నారు. తిరుపతి రుయాలోని టెలిహబ్‌లోని వైద్యులు ఆన్‌లైన్‌లో సలహాలు సూచనలు ఇస్తున్నారు. వీడియా కాల్స్‌ తీసుకుని, పేషెంట్లతో నేరుగా మాట్లాడి, వారి సమ స్యలు తెలుసుకుని ఏ మందులు వాడాలో చెబుతున్నారు. జిల్లాలో రోజూ 400 మంది రోగులు పీహెచ్‌సీ, ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు పొందుతున్నారు.

అంతరాయాలు లేవు 
జిల్లాలో కోవిడ్‌ నివారణ చర్యలు చేస్తున్నప్పటిరీ పీహెచ్‌సీ, ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలకు ఎటువంటి అంతరాయాలూ లేవు. 108 ద్వారా అత్యవసర కేసులను ఆస్పత్రులకు తరలించి, చికిత్స చేస్తున్నాం. సేవలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాం. – పెంచలయ్య, డీఎంహెచ్‌ఓ 

>
మరిన్ని వార్తలు