మనసున్న డాక్టర్‌

2 Nov, 2018 07:48 IST|Sakshi
దివ్యాంగుడి వివరాలు తెలుసుకుంటున్న డాక్టర్‌ సిద్దారెడ్డి

చిన్నారికి 90 శాతం వైకల్యం

పింఛన్‌కు అర్హునిగా గుర్తించని ప్రభుత్వం కదిరి సిద్దారెడ్డి దృష్టికి సమస్య

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే వరకు ప్రతినెలా రూ.2వేల సాయం

అనంతపురం, కదిరి: ఈ చిన్నారి పేరు కార్తీక్‌. వయస్సు 12ఏళ్లు. పుట్టుకతోనే బుద్ధిమాంద్యం, అంగవైకల్యంతో జన్మించాడు. చిన్నారికి రెండేళ్లు కూడా నిండకనే తల్లి భారతి కడుపునొప్పితో కన్నుమూసింది. తండ్రి మల్లికార్జున బేల్దారి పనిచేస్తూ ఇంటికి వారానికో 10 రోజులకో వచ్చి వెళ్తుంటాడు. పిల్లాడి బాధ్యతలన్నీ అవ్వ(నాన్మమ్మ) వెంకటమ్మ చూసుకుంటోంది. ఈమెకు 80 ఏళ్లు. తనకు వచ్చే రూ.1000 పింఛన్‌తోనే కుటుంబాన్ని పోషిస్తూ చిన్నారి బాగోగులు కూడా చూస్తోంది. 90 శాతం అంగవైకల్యం సర్టిఫికెట్‌ చేతబట్టుకొని మనవడికి పింఛను ఇప్పించాలని ఈ అవ్వ తొక్కని గడపంటూ లేదు. తిరగని కార్యాలయం అంటూ లేదు. ‘నీకు రూ.1000 పింఛను ఇస్తున్నాం కదా.. మళ్లీ నీ మనవడికి కూడానా..? అలా కుదరదు. నువ్వు చస్తే నీ మనవడికి పింఛన్‌ వస్తుంది. లేదంటే కుదరదు.’ అని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ స్థానిక నాయకుడు అన్నట్లు ఈ అవ్వ వాపోతోంది.

‘వాడి పింఛన్‌ కోసం నేను చావాలంట నాయనా.. నేను చస్తే వీడికి దిక్కెవరు? వీడికి అమ్మ లేదు. వీళ్ల నాయన అమావాస్యకో, పున్నానికో వస్తాడు..’ అని కన్నీరు పెట్టింది. ఈ పరిస్థితుల్లో ‘గుడ్‌మార్నింగ్‌ కదిరి’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి గురువారం అమీన్‌నగర్‌లో గడపగడపకూ వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తన కంటపడిన ఈ దివ్యాంగుడిని పలకరించాడు. అక్కడే ఉన్న ఓ మహిళ ‘సార్‌ పిల్లోడికి మాటలు రావు.. బుద్ధిమాద్యం’ అని చెప్పింది. పింఛన్‌ కోసం ఆ పిల్లోడి అవ్వ తిరిగి తిరిగి వేసారింది. ఎవ్వరూ పట్టించుకోలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చింది. పిల్లాడికి సంబంధించిన అంగవైకల్యం సర్టిఫికెట్‌ను డాక్టర్‌ సిద్దారెడ్డి పరిశీలించారు. 90 శాతం అంగవైకల్యం ఉందే.. అంటూ పింఛన్‌ ఎందుకివ్వలేదని ఆరా తీశారు. ‘సరే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అబ్బాయికి నెలకు రూ.3 వేల పింఛన్‌ ఇప్పిస్తాం. అంత వరకు నేనే నెలకు రూ.2 వేలు చొప్పున పింఛన్‌ రూపంలో నగదు ఇస్తా’ అని హామీ ఇచ్చారు. సిద్ధారెడ్డి నిర్ణయం పట్ల ఆ వీధి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తామంతూ మీవెంటే ఉంటామని ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు