కార్పొ‘రేటు’ ఏజెంట్లు

13 Oct, 2019 11:16 IST|Sakshi
తణుకులో ఓ ఆర్‌ఎంపీ క్లినిక్‌ వద్ద ఆరుబయట వైద్యం చేస్తున్న దృశ్యం

రిఫరల్‌ పేరుతో పక్కా దోపిడీ

కమీషన్‌ ఏజెంట్‌లుగా ఆర్‌ఎంపీలు

విస్తరిస్తున్న కార్పొరేట్‌ ‘కాసు’పత్రులు

వైద్యం.. సేవ.. అన్నమాట ఒకప్పటిది.. ప్రస్తుతం వైద్యం.. పక్కా వ్యాపారంగా మారింది. రోగి బాధను, భయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రణాళికా బద్ధంగా సాగిపోతోందీ వ్యాపారం. ప్రస్తుతం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే కార్పొరేట్‌ ఆసుపత్రులు సైతం కమీషన్లు ఇచ్చి రోగులను ఆసుపత్రులకు రప్పించుకునే పరిస్థితి.

సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌)ల నుంచి పట్టణాల్లో పెద్ద డాక్టర్ల వరకు రోగుల నుంచి వచ్చే కమీషన్లపైనే బతుకుతున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. డాక్టర్లకు లక్షలకు లక్షలు జీతాలు చెల్లించి మరీ కార్పొరేట్‌ ఆసుపత్రులు వారిని పోషిస్తున్నాయి. ఆ ఖర్చులను రోగులపై రుద్దేస్తూ ఒకవైపు... మరోవైపు రోగుల సంఖ్య పెంచేలా డాక్టర్లకు సైతం టార్గెట్లు నిర్దేశిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సదరు డాక్టర్లు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్‌ఎంపీలకు కమీషన్లు ఇస్తున్న డాక్టర్లు ఆ డబ్బులను రోగులపై బాదేస్తున్నారు. ఇదంతా పెద్ద మాఫియాగా నడుస్తున్న వ్యవహారం. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో వీరి వ్యాపారం మూడు సిరెంజీలు.. ఆరు మందు బిళ్లలుగా సాగిపోతోంది.  

డాక్టర్ల ముసుగులో..
అక్షరం ముక్క మెడికల్‌ టెర్మినాలజీ రాని ఆర్‌ఎంపీలంతా డాక్టర్ల పేరుతో చలామణి అవుతున్నారు. ఇంటికి వచ్చి మందులు ఇస్తూ పిలిస్తే పలికే ఆర్‌ఎంపీల వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది. కమీషన్లు, గిఫ్టులు, వాటాలు, స్టార్‌ హోటళ్లలో విందులు, విదేశీయానాలు ఇలా ఒక్కటేమిటి ఆర్‌ఎంపీలు అనుభవిస్తున్న రాజభోగం అంతా ఇంతా కాదు. పట్టణాల్లోని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలకు 20 నుంచి 30 శాతం కమీషన్లు ఇచ్చి మరీ రోగులను ఆసుపత్రులకు రప్పించుకుంటున్నాయి. ఇలాంటి కమీషన్లకు ఆశపడుతున్న ఆర్‌ఎంపీలు రోగులను భయపెట్టి మరీ వారు చెప్పిన ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నాచితకా వైద్యం చేసుకునే ఆర్‌ఎంపీలు కార్పొరేట్‌ ఆసుపత్రులతో సంబంధాలు పెట్టుకుని రోగులను, వైద్యాన్ని సైతం శాసించే స్థాయికి ఎదిగారు. అవసరం లేకపోయినా రోగుల్ని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులకు పంపించి అడ్డగోలు ఆపరేషన్లు చేయిస్తున్నారు.

జిల్లాలో వేళ్లూనుకున్న మెడికల్‌ మాఫియా
చిన్నపాటి జబ్బులకు కూడా రకరకాల పరీక్షలు చేయించి ఎక్కువ ఖర్చు చేయిస్తూ తమ వాటా తాము తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆర్‌ఎంపీలు ఏర్పాటు చేస్తున్న క్లినిక్‌ల సంఖ్య పెరుగుతోంది. వీళ్లకు కమీషన్లు ఇచ్చేందుకు ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా పీఆర్‌వో పేరుతో ఒక బృందం ఉంటుంది. ఏ ఆపరేషన్‌కు ఎంత కమీషన్‌ ఇవ్వాలి, ఏ ఆర్‌ఎంపీలకు ఎంత ముట్టజెప్పాలో వీరు చూసుకుంటారు. అప్పుడప్పుడూ గ్రామాలకు వెళ్లి పీఎంపీలతో కొత్త డీల్స్‌ కుదుర్చుకుంటూ ఉంటారు. నిత్యం రూ.కోట్లలో సాగుతున్న ఈ దందాపై అధికారులు దృష్టి  సారించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

‘కాసు’పత్రులు
కాలంతోపాటు వైద్య రంగంలో సేవాభావం కనుమరుగవుతోంది అనడానికి కార్పొరేట్‌ ఆసుపత్రులే ఉదాహరణ. కార్పొరేట్‌ వైద్యంలో చాలా భాగం కాసులే పరమావధిగా సాగుతోందనే అపవాదు ఉంది. జిల్లాలో సుమారు 2 వేల వరకు ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉంటే దాదాపు 50 వరకు కార్పొరేట్‌ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నింటికీ అనుసంధానంగా సుమారు 2 వేల మంది ఆర్‌ఎంపీలు వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రులు అంటే సామాన్యుల నుంచి కాసులు పిండే యంత్రాలుగా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదేమో. ఇటీవల చిన్నపాటి ఆసుపత్రులన్నీ కలిసి తమకు అనుసంధానంగా కార్పొరేట్‌ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. రోగులను చివరి క్షణం వరకూ పీల్చి చివరి దశలో డాక్టర్లు కార్పొరేట్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. ఇక్కడ చనిపోయిన రోగి నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులకు అనుసంధానంగా డయోగ్నోస్టిక్‌ సెంటర్లు సైతం ఇదే తరహా దోపిడీ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సాధారణంగా స్టెరాయిడ్స్‌ ఇవ్వడం, యాంటీబయోటిక్స్‌ వాడటం వంటివి ఆర్‌ఎంపీలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాలోని కొందరు ఆర్‌ఎంపీలు మాత్రం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ గర్భవిచ్చిత్తికి సైతం మందులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.   

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం
జిల్లాలోని ఆర్‌ఎంపీలు నిబంధనలు మీరి వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. కొందరైతే స్టెరాయిడ్స్‌ కూడా రోగులపై ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డెంగీ టెస్టులు రాయడం, యాంటీ బయోటిక్స్‌ మందులు ప్రిస్క్రైబ్‌ చేయడం వంటివి చేస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. కొందరు ఆర్‌ఎంపీలు ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా క్లినిక్‌లు సైతం ఏర్పాటుచేశారు. వీరిపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు.  
– వి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్‌ఓ, ఏలూరు

మరిన్ని వార్తలు