డాక్టర్ నవ్య అనుమానాస్పద మృతి

10 Feb, 2014 12:54 IST|Sakshi

భర్త వేధింపులకు మరో మహిళ బలైంది. మంచిర్యాలకు చెందిన డాక్టర్ నవ్య సోమవారం ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతి మొత్తం అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. సోమవారం తెల్లవారుజామున బాత్రూంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, తన భార్య బాత్రూంలో పడిపోయిందని.. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లందని ఆమె భర్త, స్థానికంగా జనరల్ ఫిజీషియన్ అయిన డాక్టర్ మనోజ్ కుమార్ పలువురు మిత్రులకు తెలిపారు. కాసేపటికే ఆమె చనిపోయిందని చెప్పి, నవ్య తండ్రి డాక్టర్ రాంబాబు ఇంటికి మృతదేహాన్ని తరలించారు. అక్కడ ఫ్రీజర్ బాక్సులో నవ్య మృతదేహాన్ని ఉంచారు.

కాసేపటి తర్వాత విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్త వేధింపుల కారణంగానే డాక్టర్ నవ్య ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య మృతదేహం వద్ద మనోజ్ కుమార్ ఏడుస్తున్నా, అది ఏమాత్రం సహజంగా లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆయన నిజంగానే తన భార్య మృతిపట్ల బాధపడుతున్నారని చెబుతున్నారు. నవ్య తండ్రి డాక్టర్ రాంబాబు మంచిర్యాలలో గత 20-30 ఏళ్లుగా ప్రసిద్ధి చెందిన రేడియాలజిస్టు. ఆయన స్కానింగ్ సెంటర్ అంటే ఈ ప్రాంతంలో చాలామందికి మంచి గురి ఉంది. అయితే, వైద్య విద్య పూర్తి చేసిన నవ్య మాత్రం ప్రస్తుతం ప్రాకట్ఈసు చేయకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు