శిల్ప ఆత్మకు శాంతి కలిగేనా..?

3 Apr, 2019 13:12 IST|Sakshi
డాక్టర్‌ శిల్ప(31)

ఎస్వీఎంసీ వైద్య విద్యార్థిని డాక్టర్‌ శిల్పఆత్మహత్య చేసుకుని నేటికి 9 నెలలు

కోర్టులో నలుగుతున్న కేసు

ఆ ఇద్దరు వైద్యులు నిజాయితీపరులని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

తిరుపతి (అలిపిరి) : ఎస్వీ వైద్య కళాశాల పిడియాట్రిక్‌ పీజీ ఫైనలియర్‌ వైద్య విద్యార్థిని డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకుని నేటికి తొమ్మిది నెలలు గడుస్తోంది.  డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య ఉదంతంపై సిట్‌ విచారణ చేసి, ముగ్గురు వైద్యుల వేధింపులే దీనికి కారణమని నిర్ధారించింది. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం íపిడియాట్రిక్‌ విభాగాధిపతితో పాటు మరో ఇద్దరు వైద్యులపై చర్యలు తీసుకుంది.  ప్రస్తుతం  కేసు విచారణలో ఉంది. నెలలు గడుస్తున్నా ఇంతవరకు నేరస్తులకు శిక్ష పడలేదు. అయితే, ఇటీవల సోషల్‌ మీడియాలో ముగ్గురు వైద్యుల్లో ఇద్దరు నిజాయితీపరులంటూ పోస్టులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇవి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయేమోననే వైద్యులు చర్చించుకుంటున్నారు.

డాక్టర్‌ శిల్ప(31) ఆత్మహత్యకు  పిడియాట్రిక్‌ వైద్యులు డాక్టర్‌ రవికుమార్, డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శశికుమార్‌ లైంగిక వేధింపులే కారణమని 2018 నవంబర్‌ 9న సిట్‌ నివేదిక వెల్లడించింది. డాక్టర్‌ రవికుమార్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. అలాగే మిగతా వైద్యులు డాక్టర్‌ కిరిటి, డాక్టర్‌ శశికుమార్‌ను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ చేసింది. అలాగే, కళాశాలలో ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఎస్వీఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమణయ్య పదవి  నుంచి తొలగించారు.

ముగ్గురిలో ఇద్దరు వైద్యులునిజాయితీపరులా..?
సిట్‌ దర్యాప్తులో శిల్ప ఆత్మహత్యకు ఆ ముగ్గురు వైద్యులు కారణమని తేల్చింది. అయితే కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు వాస్తవాలను మీడియా  తెలుసుకోవాలని కోరారు. ‘‘డాక్టర్‌ శిల్ప పిడియాట్రిక్‌ పీజీ ఫైనలియర్‌లో ప్రాక్టికల్స్‌లో పాస్‌ అయ్యింది. థియరీలో మాత్రం ఓ సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యింది. థియరీ అనేది సెంట్రల్‌ కరెక్షన్‌.. ఏ పేపర్‌ ఎక్కడ ఉందో తెలియదు.. అలాంటప్పుడు ఆమె ఫెయిల్‌ కావడానికి మేం కారణం కాదు.. కలెక్టర్‌ కమిటీ విచారణలో డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శశిలకు సంబంధం లేదని డాక్టర్‌ శిల్ప రాతపూర్వకంగా రాసిచ్చింది. మా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో అర్థం కావడం లేదు. కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. త్వరలో నిజాలు వెలుగు చూస్తాయి.’’ అంటూ కేసు విచారణ ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం చర్చకు దారితీసింది.

టీడీపీ పాలనలో దారుణమైన ఘటన
టీడీపీ పాలనలో వైద్య రంగంలో శిల్ప ఆత్మహత్య అత్యంత దారుణమైన ఘటన. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని 2018 ఏప్రిల్‌ 3న గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తరువాత హెల్త్‌ వర్సిటీ వీసీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్యుల బృందం విచారణ  నివేదిక సమర్పించక మునుపే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అనుకూలంగా ఎస్వీఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమణయ్య(ప్రస్తుతం మాజీ) అప్పట్లో ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి కలెక్టర్‌తో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. నివేదిక సమర్పిం చక మునుపే శిల్ప ఆత్మహత్య చేసుకుంది. ఇది సంచలనం çసృష్టించింది. డాక్టర్‌ శిల్ప ఆత్మహత్యకు కారకులైన వారికి  కోర్టులో శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందని సహచర వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

బాధ్యులకు శిక్ష పడాలి
నా కుమార్తె ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. జరగకూడనిది జరిగింది. నా కూతురే భౌతికంగా దూరమైనప్పుడు ఏమని స్పందించాలి? అది మరచిపోలేని సంఘటన. వెంటాడుతూనే ఉంది. బాధ్యులకు శిక్ష పడాలి.  ప్రస్తుతం నేను ఉద్యోగం చేసుకుంటున్నా.– రాజగోపాల్, మృతురాలి తండ్రి, పీలేరు

మరిన్ని వార్తలు