ఆరోగ్య రక్షకా.. ఆపద్బాంధవా!

18 Jul, 2020 13:23 IST|Sakshi
తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కోవిడ్‌ ఓపీలో వైద్యసేవల్లో వైద్యులు, సిబ్బంది

కరోనా వైరస్‌పై వైద్యుల అలుపెరుగని పోరు

ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు వైద్యసేవలు

లక్షణాలు లేని రోగులతో పొంచి ఉన్న ముప్పు

కరోనా బారిన 20 మంది వైద్యులు, సిబ్బంది

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఏకైక మహమ్మారి కోవిడ్‌–19 వైరస్‌. కంటికి కనిపించని ఈ వైరస్‌తో ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తూ రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు వైద్యులు, సిబ్బంది. పీపీఈ కిట్స్‌ తదితర అధునాతన రక్షణ కవచాలను ధరించి విధులను నిర్వర్తిస్తున్నా వారికి కరోనా సోకు తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

తణుకు అర్బన్‌ : ముట్టుకుంటే చుట్టేస్తుందని తెలుసు.. చుట్టుకుంటే ప్రాణాలు తీసేస్తుందని తెలిసినప్పటికీ ఎంతో ధైర్యంగా వైద్యసేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిని భగవంతుడి స్వరూపాలుగా కొలుస్తున్నారు ప్రజానీకం. అటువంటివారు సైతం కరోనా వైరస్‌ ధాటికి విలవిల్లాడే పరిస్థితి నెలకొంది.  జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్న రోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఏ లక్షణాలు లేకుండా వస్తున్న రోగులతోనే ముప్పు పొంచి ఉందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాజిటివ్‌ నిర్ధారణ అంశంలో స్వాబ్‌ పరీక్ష కోసం వైద్యులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు చూపిస్తున్న చొరవను సోషల్‌ మీడియాలో సైతం వారి సేవలు అజరామజరం అంటూ నెటిజన్లు వేనోళ్ల పొగుడుతున్నారు.

జిల్లాలో 20 మందికి వైరస్‌
జిల్లాలో ఇప్పటివరకు ఏలూరు కోవిడ్‌ సెంటర్‌తోపాటు వైద్యవిధాన పరిషత్, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 10 మంది వైద్యులు, 10 మంది వైద్య సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. తాజాగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో విశేష సేవలందిస్తున్న గైనిక్‌ వైద్యురాలు వైరస్‌ బారినపడడం గమనార్హం. తన సర్వీసులో వేల సంఖ్యలో ప్రసూతి సేవలు అందించిన ఆమె సేవలు అజరామజరం అనే మాటలు వైద్యవర్గాల్లో వినిపిస్తున్నాయి. వైద్యో నారాయణ అంటూ భగవంతుడితో పోలుస్తున్న వైద్యుడికి కూడా కరోనా కాటు తప్పకపోవడంతో సాధారణ ప్రజానీకంలో మరింత భయం పెరిగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా పాజిటివ్‌ బాధితుల కారణంగా 10కిపైగా ప్రైవేటు ఆస్పత్రులు మూతపడగా, ఆయా ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది సైతం హోం క్వారంటైన్‌లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైద్య విధాన పరిషత్‌లో 115 మంది వైద్యులు, 2వేల మంది నర్సులు సిబ్బంది విధుల్లో ఉండగా,  వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 185 మంది వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది 10వేల మంది విధుల్లో ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు